
భూప్రపంచం మీద ఉన్న జంతువులలో కుక్కలు ప్రత్యేకం. ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలను చాలామంది పెంచుకుంటూ ఉంటారు. కుక్కలు పలు సందర్భాల్లో ఇంట్లోని వస్తువులను చిందరవందర చేస్తూ ముఖ్యమైన, విలువైన వస్తువులను పగలగొడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో కుక్కలు చేసే కొంటె పనులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఒక కుక్క ఒక కొంటె పని చేసింది.
జోసెలిన్ అనే మహిళ తన సంపాదనలో కొంత మొత్తాన్ని బెడ్ దగ్గర దాచుకుంటూ ఉండేది. యజమాని ఎంతో భద్రంగా దాచుకున్న డబ్బు కుక్క కంట పడింది. యజమాని ఇంట్లో లేని సమయం చూసి ఆ డబ్బును చిన్నచిన్న ముక్కలుగా చేసి తినడానికి ప్రయత్నించింది. నేలను తాకిన దేన్నైనా తినాలని ప్రయత్నించే కుక్క ఆ విధంగా 9,800 రూపాయల విలువైన నగదును ముక్కలుముక్కలుగా చేసింది.
డబ్బును ఉపయోగించడానికి వీలు లేకుండా చేసిన ఆ కుక్క పేరు పెగ్గీ. ఇంటికి వచ్చిన జోసెలిన్ భర్త అలన్ కు కుక్క చేసిన ఘనకార్యాన్ని తలచుకుని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. భార్య ఇంటికి వచ్చిన వెంటనే అలన్ ఆమెకు కుక్క చేసిన ఘనకార్యం గురించి చెప్పాడు. బెడ్ మీద ముక్కలుగా ఉన్న నోట్లను చూసి ఆమె బాధ పడింది. అయితే కుక్క తెలియక చేసిన పని కావడం ఆమె ఏమీ అనలేకపోయింది. జొసెలిన్ ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఘటన తెగ వైరల్ అవుతోంది.