Fog Driving: తావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా వపరీతమైన చలి నమోదవుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత అధికమవుతోంది. పైగా ఉదయం 11:00 గంటల దాకా మంచు కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మంచు వల్ల ప్రయాణం మాత్రమే కాదు ఆస్తమాతో బాధపడే వారు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ కేసులు పెరిగేందుకు కూడా ఈ మంచు ఒక కారణమని వైద్యులు అంటున్నారు. అయితే ఈ మంచు విపరీతంగా కురవడం వల్ల ప్రయాణికులు ముఖ్యంగా భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా మంచు కురవడం వల్ల గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా భారీగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇక క్షతగాత్రులకు అయితే లెక్కేలేదు. ఇలాంటి అప్పుడు మంచులో ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలకు గురికాకుండా ఉండొచ్చు? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
పగటిపూట రోడ్డు మీద ప్రయాణం పెద్దగా ఇబ్బందులు లేకుండా చేయవచ్చు. అదే మంచు కురుస్తుంటే ప్రయాణం చేయడం దాదాపు అసాధ్యం. మరియు ముఖ్యంగా భారీ భారీ ట్రక్కులు నడిపే వారైతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దట్టంగా కురుస్తున్న మంచు వల్ల ఎదురుగా ఏ వాహనం వస్తుందో అర్థం కాదు. లైట్లు వేసుకుని నడుపుతున్నప్పటికీ అద్దాల మీద మంచు కురవడం వల్ల మసక ఏర్పడుతుంది. దానివల్ల ఎదురుగా వచ్చే వాహనం కనిపించదు. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. పైగా భారీ ట్రక్కులు కాబట్టి ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అలాంటప్పుడు మంచులో ప్రయాణం చేయకపోవడమే ఉత్తమం.. అత్యవసరం అనుకుంటే నిదానంగా వెళ్లాలి. సాధ్యమైనంతవరకు రోడ్డు పక్కగానే ప్రయాణం చేయాలి. దాంతోపాటు ఎక్కువ ఫోకస్ కలిగి ఉండే లైట్లనే వాడాలి. ఇక అద్దాలకు సంబంధించి వైబర్లు కూడా నాణ్యమైన వాడితేనే మంచు ఎప్పటికప్పుడు తొలగిపోతుంది.
ఇక ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం చేసేవాళ్లు మంచులో వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ద్విచక్ర వాహనాలకు ఉండే లైట్ల సామర్థ్యం ఒక స్థాయి వరకే ఉంటుంది. వాటిని వేసినప్పటికీ ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక చాలామంది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారీ ట్రక్కులను నడిపే వారే ఇలా చేస్తూ ఉంటారు. చలికాలం కావడంతో శరీరంలో వెచ్చదనం ఉండేందుకు వారు ఈ పని చేస్తూ ఉంటారు. అయితే ఇలా మద్యం తాగి వాహనం నడపడం వల్ల దాని మీద అదుపు ఉండదు. పైగా మంచు కురుస్తుండడం వల్ల ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భారీ ట్రక్కులు నడిపేవారు మద్యం తాగకుండా ఉండటమే మంచిది. మరీ ముఖ్యంగా భారీ ట్రక్కులను రోడ్డు పక్కనే నిలుపుదల చేస్తారు. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలకు అవి కనిపించకపోవడం వల్ల గుద్దేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహాలో జరిగే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ. అందువల్ల భారీ వాహనాలను రోడ్డు పక్కన కంటే కొంచెం ఖాళీ స్థలంలో ఆపడం మంచిది.. దానివల్ల ప్రమాదాలను తగ్గించిన వారమవుతాం. ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలు కానీ, కార్లు గాని నడపాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాల్సిందే. కూడా అత్యంత నాణ్యమైనవే వాడాల్సి ఉంటుంది. ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు అవి రక్షణగా నిలుస్తాయి. వాటి వల్ల చిన్న చిన్న గాయాలతోనే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.. శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు ఈ మంచులో ప్రయాణం చేయకపోవడమే మంచిది. సాధ్యమైనంతవరకు మంచులో ప్రయాణం చేస్తున్నప్పుడు హారన్ వినియోగించడం అత్యంత శ్రేయస్కరం.