Hombale Films- Amazon: కాంతారా.. కన్నడలోనే కాదు అన్ని భాషల్లోనూ ఇప్పుడు ఒక సంచలనం. చిన్న సినిమాగా విడుదలై 400 కోట్లను కొల్లగొట్టింది. హోంబాళే ఫిలిమ్స్ స్థాయిని మరింత పెంచింది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో ఫుల్ రన్ కొనసాగిస్తోంది. స్టారాధిస్టారులు నటించిన సినిమాలు వారంలోపే వెనక్కి తిరిగి వస్తుండగా… కాంతారా ఇప్పటికి కూడా సాలిడ్ రన్ కొనసాగిస్తోంది.. అయితే ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా గత గురువారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇక్కడ దాకా కథ బాగానే ఉంటే.. ఈ కథనం మేము రాయాల్సిన అవసరం ఉండకపోయేది.. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చింది.. అమెజాన్ దెబ్బకు హోంబాళే ఫిలిమ్స్ కు చుక్కలు కనపడ్డాయి. ఏకంగా వరాహరూపం పాట ఆగిపోయింది కాదు కాదు కత్తిరించబడింది.. అది సెటిల్ చేసే వరకు ప్రసారం చేయబోనని అమెజాన్ మంకు పట్టు పట్టింది. పైగా ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదు.. ఎలాగూ థియేటర్లలో సినిమా విడుదలైంది.. డబ్బులు కూడా బాగానే వచ్చాయి.. టికెట్లు కూడా కేజిఎఫ్ కంటే ఎక్కువ తెగాయి . ఇప్పుడు చేతిలో బొచ్చెడు సినిమాలు ఉన్నాయి.. వాటికి డబ్బు సర్దుబాటు చేయాలి.. పైగా సలార్ సినిమా షూటింగ్ భారీ ఎత్తున జరుగుతోంది.. అనుకున్న బడ్జెట్ దాటిపోతోంది. ఇలాంటి సమయంలో హోంబాళే కు డబ్బులు అవసరం బాగా పడింది.. గత్యంతరం లేక అమెజాన్ పెట్టిన షరతుకు హోంబాళే తలొగ్గింది. ఆ పాటను తీసేసింది. అదే కంటెంట్ తో ఏదో కొత్త పాటలు కంపోజ్ చేయించి పెట్టింది.. అప్పుడుగాని అమెజాన్ ప్రసారానికి సిద్ధపడలేదు.. కొత్త పాట మరి అంత బాగోలేదు. మొత్తానికి కాంతారా ప్రాణం తీసేసింది.

ఇదే చర్చ
ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న నాటి నుంచి సోషల్ మీడియాలో భారీ చర్చ సాగుతోంది.. దీనివల్ల రిషబ్ శెట్టి కాంతారా ఇమేజ్ ఘోరంగా డౌన్ అయింది. వాస్తవానికి కాంతారా సినిమాకి ఆ వరాహ రూపమే ప్రధాన బలం. ముఖ్యంగా ఆ 30 నిమిషాలు వచ్చే క్లైమాక్స్ పోర్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదే ప్రేక్షకులను మళ్లీమళ్లీ సినిమా థియేటర్ల వైపు చూసేలా చేసింది.. ఈమధ్య ఇలా ప్రేక్షకులను రిపీటెడ్ గా రప్పించిన సినిమా లేదంటే అతిశయోక్తి కాదు.. ఇక కొత్త పాటలో అంత పంచ్ కనిపించడం లేదు. ట్యూన్ కూడా సరిగ్గా లేదు. అప్పటికప్పుడు రాసిన పాట కావడంతో దాని ఆత్మ చచ్చిపోయింది.. అందుకే #bring back varaha Rupam సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్లో అయితే రెండు రోజుల నుంచి ట్రెండింగ్లో ఉంది.
ఇదీ చాలదన్నట్టు
అమెజాన్ పెట్టిన షరతులతో తల బొప్పి కట్టిన హోంబాళే ఫిలిమ్స్ కు థైక్కుడం బ్రిడ్జి అనే మ్యూజిక్ కంపెనీ రూపంలో మరో ఇబ్బంది ఎదురయింది.. అప్పుడెప్పుడో తాము విడుదల చేసిన నవరసం అనే పాటను కాపీ కొట్టి పరాహ రూపం తయారు చేశారని ఆ కంపెనీ కోర్టుకెక్కింది. దీంతో ఆ పాట వాడుకోకుండా కేరళ రాష్ట్రంలోని కోజిక్కొడ్ జిల్లా సెషన్స్ కోర్టు స్టే విధించింది.. మొత్తం అన్ని ఫ్లాట్ ఫారాల నుంచి తీసేయాలని అప్పట్లో ఆర్డర్ వేసింది.. యూట్యూబ్ సహా అన్ని డిజిటల్ ప్లాట్ఫారాల నుంచి ఆ పాటను తొలగించారు. కానీ ఓటిటిలో ఏం చేస్తారనే ఆసక్తి అందరిలో ఉండేది..హోంబాళే ఫిలిమ్స్ థైక్కుడం బ్రిడ్జి ఆడియో కంపెనీతో కోర్టు బయట రాజి కుదుర్చుకునేందుకు ప్రయత్నించినట్లు లేదు. ఇక ఈ సినిమా తీసిన హోంబాళే ఫిలిమ్స్ వాళ్లు హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు.. కానీ కోర్టు వాటిని కొట్టేసింది.. కోట్లు తీర్పు ఏమొస్తుందో తెలియదు కాబట్టే ఇన్ని రోజులు ఓటిటి ప్రసార తేదీని చెప్పలేకపోయారు.. ఇప్పుడిక అల్లబడిన పాటను పెట్టేసి ప్రసారానికి పచ్చ జెండా ఊపారు.. కానీ ఆ పాట తొలగింపుతో సినిమా ప్రాణం తీసేశారు..

కొంచెం మాత్రమే తేడా
హోంబాళే ఫిలిమ్స్ నిర్మించిన కాంతారా సినిమాలో పాటను, ఆ మ్యూజిక్ కంపెనీ రూపొందించిన పాటను గమనిస్తే రెండు వేరువేరులా కనిపిస్తున్నాయి.. కాకపోతే ఆధునిక మ్యూజిక్ కు, కర్ణాటక మ్యూజిక్ తో ఫ్యూజన్ చేసి రెండు పాటలు రూపొందించారు.. అయితే ఇది కాపీ ఎలా అవుతుంది అనేది కొంతమంది ప్రశ్న.. పైగా కంటెంట్ కూడా వేరే విధంగా ఉంది. అన్నింటికీ మించి రెండు వీడియోల్లో కనిపించే ఆదివాసి అర్చన రీతులు పూర్తిగా వేరే విధంగా ఉన్నాయి.. మరి ముఖ్యంగా ఒకటి కథాకళి, మరొకటి భూత్ కోలా.. స్థూలంగా చెప్పాలంటే ఒకటి కన్నడ, మరొకటి మలయాళీ.. భాషలు కూడా వేరే.. అయినప్పటికీ కాంతారా గొంతు కోసేశారు. ప్రేక్షకులకు ఎక్కడా లేని అసంతృప్తి మిగిల్చారు.