Dasara Trailer Review : నాని గొప్ప యాక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తారు. మరి నటనకు స్కోప్ ఉన్న పాత్ర పడితే ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో దసరా ట్రైలర్ లో శాంపిల్ చూపించారు.నాని డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో వీరవిహారం చేశారు. దసరా టైటిల్ పెట్టడం వెనుక అసలు కారణం, కథకు ఆ టైటిల్ కి ఉన్న సంబంధం ట్రైలర్ తో అవగాహన వచ్చింది. చెడు పై మంచి గెలిచిన రోజు. దుర్మార్గం, అరాచకాలకు అంతం పలికిన రోజు దసరా జరుపుకుంటారు. సీతను అపహరించిన రావణుడుపై రాముని విజయమే దసరా. ఈ చిత్రం థీమ్, స్టోరీ లైన్ అదే.
ప్రజల జీవితాలతో ఆడుకునే రాజకీయ నాయకులపై, ధనికులపై సామాన్యుడి విజయంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. అల్లరి చిల్లరగా తిరిగే ఒక విలేజ్ లేబర్ ధరణి పెద్దలను ఎదిరించి ఎలా నిలబడ్డాడు. తనని, తన కుటుంబాన్ని, ఊరిని కాపాడుకోవడానికి ఏం చేశాడు అనేదే ప్రధాన కథ కావచ్చు. ధనిక-పేద వర్గాల మధ్య తారతమ్యాలు, లోకల్ పాలిటిక్స్ వాటి కారణంగా వర్గ విభేదాలు, రక్తపాతం దసరా మూవీలో చూడొచ్చు.
ఇక దసరా మూవీతో ఓ గొప్ప పాత్ర కీర్తి సురేష్ దక్కించుకున్నారని అర్థం అవుతుంది. డార్క్ క్రైమ్ పొలిటికల్ విలేజ్ డ్రామాలో అంతర్లీనంగా ధరణి-వెన్నెల ప్రేమ కథ చెప్పారు. వీరి బంధంతో కథకు స్ట్రాంగ్ లింక్ పెట్టాడు. వైలెన్స్ కి సమానమైన ఎమోషన్స్ చూడవచ్చు. రూత్ లెస్ మాస్ విలేజ్ కుర్రాడైన ధరణిగా నాని వెండితెరపై అద్భుతం చేయడం ఖాయం. ట్రైలర్ లోనే తనలోని మృగాన్ని పరిచయం చేశాడు. తన పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పకనే చెప్పాడు.
రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఎక్కడా తగ్గలేదు. మలయాళ నటుడు షైన్ టామ్ చక్కో విలన్ రోల్ చేశాడు. సముద్ర ఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ సాంగ్స్, బీజీఎమ్ బాగున్నాయి. మార్చి 30న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. దసరా చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అదిరిపోయే కంటెంట్ ఇస్తున్నట్లు అర్థం అవుతుంది. పాజిటివ్ టాక్ దక్కితే వసూళ్ల వర్షం ఖాయం. కమర్షియల్ హిట్ లేక అల్లాడుతున్న నాని దాహం తీర్చే సినిమా కావచ్చు. శ్యామ్ సింగరాయ్ అనంతరం ఆయన నటించిన అంటే సుందరానికీ దారుణ పరాజయం చవిచూసింది.