
Gay Couple: సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి..అందుకే ప్లస్ మైనస్ కలయిక జరగాలి అంటారు. కానీ ప్లస్ ప్లస్ కలిస్తే ఎలా ఉంటుంది? పోనీ మైనస్ మైనస్ కలిస్తే ఏం జరుగుతుంది? ఎందుకండీ ఈ దరిద్రం? కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే కదా? అని అంటారా? మీరు అన్నది వాలిడ్ పాయింటే.. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకేసి రెండు ప్లస్ లు అదేనండి.. “గే”(స్వలింగ సంపర్కులు) పొలాల్లో మొలకలు వచ్చేలా చేస్తున్నారు.
గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల వివాహాలు పెరుగుతున్నాయి. ఒక వేళ చేసుకున్నవారు ఇద్దరు ఆడవాళ్ళు అయితే.. వారిలో ఒకరి అండాన్ని, వీర్యదాత సహాయంతో ఫలదీకరణం చెందించి.. ఒక మహిళ గర్భంలో ప్రవేశపెడుతున్నారు. గర్భం దాల్చిన తర్వాత.. ప్రసవం అనంతరం ఆ బిడ్డ ద్వారా సంతాన యోగాన్ని పొందుతున్నారు. ఒకవేళ చేసుకున్నది ఇద్దరు పురుషులైతే, దాత అండంతో పిల్లల్ని కంటున్నారు. ఇదీ నిన్నా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇకపై స్త్రీ అండం లేకుండా పురుషులే సరాసరిగా పిల్లల్ని కనే అవకాశం కనిపిస్తోంది.
ఈమేరకు చిట్టెలుకలపై జపాన్ లోని క్యూషు విశ్వవిద్యాయానికి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి విజయం సాధించారు. రెండు మగ చిట్టెలుకల నుంచి అండాలను తయారుచేసి, దాని నుంచి మరో చిట్టెలుకను పుట్టించడంలో సఫలికృతులయ్యారు. దీనిని గార్డియన్ అనే పత్రిక ప్రచురించింది. దీని ప్రకారం 2018లో చైనా పరిశోధకులు రెండు ఆడ చిట్టెలుకల నుంచి మరో చిట్టెలుకను పుట్టించగలిగారు. కానీ రెండు మగ చిట్టెలుకల నుంచి మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో జపాన్ పరిశోధకులు రెండు మగ చిట్టెలుకల చర్మం నుంచి కణాలను సేకరించి దానిని స్టెమ్ సెల్ గా అభివృద్ధి చేశారు. అన్ని ఆడ చిట్టెలుక కణాలుగా మార్చారు. దాని నుంచి అండానికి అవసరమైన కణాలను ఉత్పత్తి చేశారు.

వీటి ద్వారా అండాలను అభివృద్ధి చేశారు. వాటిని ప్రత్యేకమైన వాతావరణంలో ఉంచారు. అనంతరం వాటిలో జీవకణాలు సజీవంగా ఉన్నట్టు గుర్తించిన తర్వాత వాటిని ఫలదీకరించారు. తర్వాత ఆ అందాలను ఆడ చిట్టెలుకలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో చిన్న చిట్టెలుకను పుట్టించ గలిగారు. ఈ అధ్యయనం సహాయంతో వచ్చే పదేళ్లలో మనుషుల్లోనూ స్వలింగ దంపతులు బిడ్డల్ని కనవ చ్చని పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రయోగం నేపథ్యంలో అమెరికా దేశానికి చెందిన స్వలింగ సంపర్కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇది కనుక విజయవంతం అయితే తమకు కూడా సంతానయోగం కలుగుతుందని ఆనందపడుతున్నారు..
కాగా మనదేశంలోనూ స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. వీటిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ వివరణ కోరేందుకు సుప్రీంకోర్టు ఒక నోట్ ను పంపగా.. అలాంటి వివాహాన్ని తాము ఆమోదించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సనాతన వ్యవస్థల్లో వివాహం అనేది ఒక గౌరవప్రదమైన ప్రక్రియ అని, ఇలాంటి వివాహాల వల్ల భారతీయ సంస్కృతి విచ్ఛిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మన దేశంలో ఇలా ఉంటే.. జపాన్ పరిశోధకులు మాత్రం స్వలింగ సంపర్కం ద్వారా ఎలుకల్లో సంతానం కలిగిస్తున్నారు..ఇవన్నీ చూస్తుంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది.