
Balakrishna: బాలయ్యకు ప్రియమైన అబ్బాయి తారకరత్న. ఆయన అకాల మరణం బాలయ్యను తీవ్ర వేదనకు గురి చేసింది. చివరి క్షణం వరకు తారకరత్నను కాపాడుకునేందుకు బాలకృష్ణ ప్రయత్నం చేశారు. మెరుగైన వైద్యం కోసం విదేశాల నుండి వైద్యులను తెప్పించారు. యజ్ఞయాగాదులు, పూజలు, అఖండ దీపారాధనలు చేయించారు. ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న కన్నుమూశారు. ఫిబ్రవరి 18న శివరాత్రినాడు ఆయన శివైక్యం అయ్యారు.
తారకరత్న కన్నుమూసిన అనంతరం పార్థివదేహాన్ని బెంగుళూరు నుండి హైదరాబాద్ నివాసానికి తీసుకొచ్చారు. ఆ నెక్స్ట్ డే అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. ఇక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలయ్య వద్దకు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి దూసుకువచ్చాడు. జుట్టు పెరిగి, మురికి బట్టలతో ఉన్న ఆ వ్యక్తి బాలయ్యకు వేలు చూపిస్తూ మాట్లాడాడు.
కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాలయ్య అతన్ని పక్కకు లాగేయమనలేదు. కాసేపు అతని మాటలు విన్నాడు. ఆ మతిస్థిమితం లేని వ్యక్తి హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటుండగా అతని చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరని ఆరా తీస్తే… ఫిల్మ్ నగర్ లో అతడు తిరుగుతూ ఉంటాడు. పిచ్చోడుగా భావించి జనాలు అతన్ని పట్టించుకోరట. అయితే బాలయ్య విషయంలో అతన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. శివుడే అతని రూపంలో వచ్చి హెచ్చరించాడని అంటున్నారు.

కాగా రెండు మూడేళ్లకు నందమూరి కుటుంబంలో ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంది. 2014లో జానకి రామ్, 2018లో ఆయన తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. ఇక గత ఏడాది ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఆమె కన్నుమూసి ఏడాది గడవక ముందే తారకరత్న అనారోగ్యంతో హఠాత్తుగా దూరమయ్యారు. ఈ క్రమంలో బాలయ్యను దేవుడు హెచ్చరించారంటూ ఒక వాదన మొదలైంది.
కొందరైతే అవన్నీ పిచ్చోడి చర్యలుగా కొట్టిపారేస్తున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే బాలయ్యకు దైవభక్తి, నమ్మకాలు చాలా ఎక్కువ. రంగురాళ్ల, తాయత్తులు ధరించి తిరుగుతారు. ఈ క్రమంలో ఆ పిచ్చోడి మాటలు బాలయ్య సీరియస్ గా తీసుకునే అవకాశం కలదు. కాగా తారకరత్న మరణం నేపథ్యంలో బాలయ్య తన 108వ చిత్ర షూట్ షెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.