Music Director Mani Sharma: ఈ జనరేషన్ గొప్ప సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ మిలీనియం ప్రారంభంలో తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. చూడాలని ఉంది, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఒక దశలో ఆయనకు పోటీ ఇచ్చే సంగీత దర్శకుడు లేకుండా పోయాడు. దేవిశ్రీ, థమన్ ఎదిగే వరకు మణిశర్మ టాలీవుడ్ లో ఏకచత్రాధిపత్యం చేశారు.

కొన్నాళ్లుగా ఆయన తన మార్కు మ్యూజిక్ చూపించలేకపోతున్నారు. ఒక దశ దాటాక ఎంతటివారికైనా వార్ధక్యం వచ్చేస్తుంది. మ్యూజిక్ నా ప్రాణం అనే మణిశర్మ… చివరి శ్వాస వరకు సంగీత దర్శకుడిగా పని చేయాలనే నా కోరిక అంటున్నారు. తాజాగా ఆయన తెలుగు పాప్యులర్ టాక్ షో ఆలీతో సరదాగాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణిశర్మ పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. కెరీర్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు తన మ్యూజిక్ జర్నీ వివరించారు.
రామ్ గోపాల్ వర్మతో మణిశర్మకు పరిచయం ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రాత్రి, అంతం చిత్రాలకు మణిశర్మ బీజీఎం అందించారు. రామ్ గోపాల్ వర్మ చిరంజీవి హీరోగా ఒక మూవీ స్టార్ట్ చేశారు. ఆ చిత్రానికి మ్యూజిక్ అందించే అవకాశం మణిశర్మకు వచ్చింది. రెండు సాంగ్స్ కంపోజ్ చేశాడు. అనివార్య కారణాలతో ఆ మూవీ ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ ని గుణశేఖర్ ముందుకు తీసుకెళ్లారు, అదే చూడాలని ఉంది. చిరంజీవి అప్పటికే స్టార్. నేను కంపోజ్ చేసిన రెండు ట్యూన్స్ చిరంజీవికి వినిపించి ఏ ఆర్ రెహమాన్ చేశారని అబద్దం చెప్పారు. ఆయన విని ఎగిరి గంతేశారు. తర్వాత రెహమాన్ కాదు చేసింది మణిశర్మ అని నన్ను పరిచయం చేశారు. ఆ విధంగా చిరంజీవి మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానని మణిశర్మ తెలిపారు.

నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు. దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ నా వద్ద పని చేశారు. దేవిశ్రీని సింగర్ ని చేసింది నేనే అన్నట్లు గుర్తు. అయితే జీరో నుంచి ఎదిగినవాడు థమన్ అని చెప్పాలి. థమన్ సహనమే అంతటి వాడిని చేసింది. ఒక్కోసారి పని ఒత్తిడిలో నాకు చిరాకు, కోపం వచ్చేవి. ఆ సమయంలో చేతిలో ఏది ఉంటే అది విసిరేసే వాడిని. థమన్ చాలా భయపడేవాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి టీవీ వెనక దాక్కునేవాడని, మణిశర్మ ఒకప్పటి థమన్ తో తన అనుభవాలను పంచుకున్నారు.