Delhi Liquor Scam- MLC Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు ఎమ్మెల్సీ కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆరో తారీఖునే ఆమె విచారించాల్సింది ఉండగా… సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేనందున తాను ఆరోజు విచారణకు హాజరు కాబోనని కవిత స్పష్టం చేశారు. తనకు కొన్ని కార్యక్రమాలు ముందే ఖరారై ఉన్నందున వీలుపడదని ఆమె లేఖ ద్వారా సిబిఐ అధికారులకు తేల్చి చెప్పారు. 11, 12, 14 ,15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని ఆమె సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఉత్కంఠ వాతావరణం
అయితే మంగళవారం మధ్యాహ్నం దాకా సిబిఐ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసుల మేరకు మంగళవారం విచారణకు అందుబాటులో ఉంటానని తొలుత చెప్పిన కవిత… ఆ తర్వాత మాట మార్చారు. ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేదని, ముందే ఖరారైన షెడ్యూల్ కారణంగా అందుబాటులో ఉండబోనని ఆమె స్పష్టం చేశారు.. అయితే దీనికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం వరకు సిబిఐ అధికారుల నుంచి ఎటువంటి బదులు రాలేదు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మంగళవారం కవితను విచారించేందుకు ఢిల్లీ సిబిఐ అధికారుల బృందం ప్రత్యేక ప్రశ్నావళితో సోమవారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకుంది.. కానీ ఢిల్లీ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సంకేతాలు అందకపోవడంతో మంగళవారం వారు కవిత ఇంటికి వెళ్లలేదు. మరోవైపు తాను గడువు కోరుతూ రాసిన లేఖకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి ఎటువంటి బదులు రాకపోవడంతో ఎమ్మెల్సీ కవిత సైతం మంగళవారం మధ్యాహ్నం వరకు బంజారాహిల్స్ లోని తన ఇంటి వద్ద ఉన్నారు.. అయితే బుధవారం సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తుండడం, ఆ కార్యక్రమానికి కవిత ఇన్చార్జిగా ఉండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మధ్యాహ్నం ఆమె అక్కడికి బయలుదేరి వెళ్లిపోయారు.
ఇంతలో ఈమెయిల్ ద్వారా
అయితే మంగళవారం కవితను సిబిఐ అధికారులు ఎలాగైనా విచారిస్తారేమో అనుకుని ఆమె ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు హడావుడి చేశారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.. ఈ నేపథ్యంలో తాము 11న విచారణకు వస్తామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు.. కవితకు సంబంధించిన పూర్తి చిరునామాను కూడా సిబిఐ డిఐజి రాఘవేంద్ర వత్స పేర్కొన్నారు. ఇందుకు కవిత కూడా ఆరోజు అందుబాటులో ఉంటానని బదులు ఇవ్వడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక బృందం తిరిగి విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది.

ఏం అడగనుంది?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్ గా మారిన అరోరా చెప్పిన వివరాల ఆధారంగానే కవితను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కవిత వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన అభిషేక్ రావు కూడా కీలక సమాచారం అందించడంతో వాటి వివరాలు కూడా రాబట్టేందుకు సిబిఐ అధికారులు సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేంద్రం, టిఆర్ఎస్ మధ్య ఉప్పు నిప్పులా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కవితను ఎలా విచారిస్తారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.