
Balagam Director Venu: బలగం మూవీతో టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించాడు వేణు ఎల్దండి. ఈ మూవీ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడుతున్న బలగం పలు అవార్డులు అందుకోవడం విశేషం. నిర్మాత దిల్ రాజు బలగం చిత్రాన్ని ఆస్కార్ కి పంపుతామంటూ చెప్పడం విశేషం. ఇక పల్లెల్లో బలగం మూవీ బహిరంగ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఊరి జనం మొత్తం ఓ చోట చేరి బలగం చిత్రాన్ని చూస్తున్నారు. విడిపోయిన అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బావా బావమరుదులు బలగం చిత్రం చూశాక ఒక్కటవుతున్నారట.
ఓ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని నిజ జీవితాల్లో మార్పు రావడం గొప్ప విషయం. అందుకు వేణు ఎల్దండిని ఎంత ప్రశంసించినా తక్కువే. బలగం మూవీ అత్యంత సహజంగా సాగుతుంది. అద్భుతమైన పాత్రలు మన చుట్టుపక్కల ఉన్న మనుషులన్న భావన కలిగిస్తాయి. బలగం మూవీకి ఇంత ప్రాచుర్యం రావడానికి కారణం అదే. ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఇంత పెద్ద కమర్షియల్ విజయం సాధించడం ఉహించని పరిణామం.
ఈ క్రమంలో వేణు ఎల్దండి తన నెక్స్ట్ మూవీ మీద అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. బలగం మూవీ విజయం నా మీద మరింత బాధ్యత పెంచింది. ఇంకా మంచి సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది. నా నెక్స్ట్ మూవీ కూడా దిల్ రాజు బ్యానర్లో ఉంటుంది. బలగం మాదిరి ఎమోషనల్ డ్రామా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాము. ఇలాంటి ప్యూర్ కథతోనే మరలా వస్తాను… అని వేణు అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే మరోసారి ఫ్యామిలీ ఎమోషన్స్ ని వెండితెర మీద ఆవిష్కరించనున్నాడని అర్థం అవుతుంది.

వేణు ఎల్దండి కెరీర్ కమెడియన్ గా మొదలైంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా మూవీలో వేణు కమెడియన్ గా నటించారు. ఆ మూవీలో అతని పేరు టిల్లు. దీంతో టిల్లు వేణుగా పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ కి వచ్చాక వేణు వండర్స్ పేరుతో టీం ఏర్పాటు చేసి స్కిట్స్ చేశాడు. బలగం మూవీతో దర్శకుడు అయిన వేణు… తన ఇంటి పేరుతో సహా పిలవబడుతున్నాడు. ఆయన జీవితంలో టిల్లు వేణు-వేణు వండర్స్-వేణు ఎల్దండి ఇవి మూడు దశలు అనుకోవచ్చు.