
Gannavaram: గత నాలుగేళ్లలో ఏపీలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే తప్పు చేసిన వాడి కంటే బాధితుడే ఎక్కువ మూల్యం చెల్లించుకుంటున్నాడు.దాడులకు పాల్పడుతున్న వారి కంటే.. దాడులకు గురైన వారే కటకటాల పాలవుతున్నారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు సక్రమంగా సరఫరా చేయలేదని.. కనీసం మాస్కు కూడా ఇవ్వలేదన్న పాపానికి విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వస్పత్రి డాక్టర్ సుధాకర్ పై ఏ విధంగా వ్యవహరించారో తెలిసిందే. ఇలాంటి ఉదంతాలు ఎన్నోఉన్నాయి. ఇప్పుడు గన్నవరంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేశారు. వాహనాలను దహనం చేశారు. ఈ ఘటనలో నిందితులను వదిలేసి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలపై కేసు పెట్టడం ప్రభుత్వ దమన నీతిని తెలియజేస్తోంది.
గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై కొందరు రౌడీషీటర్లు దాడిచేశారు. పోలీసులు అన్నా అన్నా అని వేడుకున్నా వారు వినలేదు. చివరకు ఈ విధ్వంసంలో లోకల్ సీఐ కూడా గాయలపాలయ్యారు. కానీ అలా దాడిచేసిన వారిని విడిచిపెట్టి టీడీపీ నేతలపై కేసు పెట్టారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టడం మూలంగానే ఇది జరిగిందని అభియోగం మోపి కేసు పెట్టారు. చివరకు టీడీపీ నేత పట్టాభిపై అట్రాసిటీ కేసు నమోదుచేశారు. అసలు దాడిచేసిన వారిని విడిచిపెట్టి.. ఇలా రెచ్చగొట్టారని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏమిటో పోలీసులకే తెలియాలని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

అయితే ఈ దాడి తన అనుచరుల పనేనని స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రకటించారు. తనను పిల్ల సైకో అన్నందు వల్లే తన అనుచరులు దాడులకు తెగబడ్డారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నట్టు కూడా వెల్లడించారు. కేవలం తనను పిల్ల సైకో అన్నందు వల్లే ఈ దాడి అంటూ వంశీ స్వయంగా ఒప్పుకున్నారు. కానీ ఆయనపై ఎటువంటి కేసు నమోదుకాలేదు. దాడులకు గురై వాహనాలు పోగొట్టుకున్న వారు మాత్రం ప్రస్తుతం జైలులో ఉన్నారు. తనను పిల్ల సైకో అన్నందు వల్లే వంశీ రెచ్చిపోతే.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను వంశీ ఎన్నెన్ని మాట్లాడుతుంటారో తెలియంది కాదు. ఆ లెక్కన టీడీపీ శ్రేణులు ఏ రేంజ్ లో వంశీపై దాడులు చేయాలని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఏపీ పోలీస్ వ్యవస్థ గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇంతలా దిగజారిపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ఘటనలో పోలీసుల నిస్తేజం, నిస్సహాయతతో కూడిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి పోలీస్ వ్యవస్థ అనుకూలంగా వ్యవహరించడం సర్వసాధారణమే అయినా.. లా అండ్ ఆర్డర్ అమలుచేసే విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఏపీ పోలీసులకు ఇప్పుడు ఆ స్వేచ్ఛ కూడా లేకుండాపోయింది. దాడులు చేసేవారిని వెనుకేసుకొస్తూ.. ఆ దాడులకు మీరు చేసిన వ్యాఖ్యలే కారణమంటూ కేసులు పెడుతుండడం, అరెస్ట్ లు చేస్తున్న వింత పరిస్థితులను ఏపీలోనే చూడాల్సి వస్తోంది.