
Oscar Award Sold: ప్రపంచంలోని ప్రతి సినిమా ప్రముఖుడు ఆస్కార్ ని ఒకసారైనా టచ్ చేయాలని భావిస్తారు. సినిమా రంగంలో అది అత్యున్నత పురస్కారంగా ఉంది. ఈ అంతర్జాతీయ సినిమా వేదికపైకి వెళ్లడం, ఆస్కార్ అందుకోవడం గొప్ప అచీవ్మెంట్. గొప్ప గొప్ప నటులు, దర్శక నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు కూడా సాధ్యం కాని అరుదైన గౌరవం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఆ తలంపు కూడా రాదు. మన చిత్రాలు, నటులు ఆస్కార్ విషయంలో ప్రపంచ సినిమాతో పోటీపడలేమని ఒక అంచనాకు వస్తారు.
అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండియన్స్ ఆస్కార్ కల నెరవేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నామినేషన్స్ దక్కించుకుంది. మరికొన్ని గంటల్లో ఫలితం రానుంది. మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ఆస్కార్ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ నామినేటైన నేపథ్యంలో టీమ్ సభ్యులు ఆస్కార్ వేడుకలో పాల్గొననున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్. కాల భైరవ ఆస్కార్స్ లో సందడి చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డుకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఆస్కార్ అవార్డు 13.5 ఇంచుల హైట్, 4 కేజీల వెయిట్ ఉంటుంది. అవార్డు మొత్తం గోల్డ్ తో చేసింది కాదు. మెటల్ మీద గోల్డ్ కోటింగ్ ఇస్తారు. ఒక్కో ఆస్కార్ అవార్డు తయారీకి సుమారు 400 డాలర్స్ ఖర్చు అవుతుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,807. అవార్డు గెలుచుకున్న వాళ్ళు తిరిగి ఆస్కార్ అమ్ముకోవచ్చు. 1950లో ఆస్కార్ అకాడమీ ఈ మేరకు రూల్ తెచ్చింది.

అయితే ఆ అవార్డు తిరిగి అకాడమీనే కొంటుంది. అమ్మిన వాళ్లకు కేవలం ఒక డాలర్ ఇస్తుంది. అంటే 82 రూపాయలు అన్నమాట. ఈ విచిత్రమైన నిబంధన తేవడానికి ఒక సంఘటన కారణమైంది. గతంలో అమెరికన్ డైరెక్టర్ ఆర్సన్ వెల్స్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నారు. తాను గెలుచుకున్న అవార్డుని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్ముకోవాలనుకున్నారు. దాన్ని వేలం వేయగా.. రూ.6.5 కోట్లు పలికింది. ఆర్సన్ వెల్స్ చేసిన పనికి అకాడమీ ఆగ్రహానికి గురైంది. ప్రతిష్టాత్మక అవార్డుకు వెలకడుతూ అమ్ముకోవడం సరికాదని భావించి, ఆస్కార్ విన్నర్ తన అవార్డు ఇతరులకు అమ్మడానికి వీల్లేదు. తిరిగి అకాడమీ సభ్యులకు ఇచ్చేస్తే… ఒక డాలర్ ఇస్తామనే నిబంధన తెచ్చారు. ఒక డాలర్ కి ఆశపడి ఎవరు అవార్డు అమ్ముకోరు కాబట్టి, ఆస్కార్ అవార్డు అమ్మకాన్ని అలా నిరోధించారు.