
BRS- YCP: “నేను గిచ్చినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చెయ్యి” ఇలా సాగుతోంది భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్సీపీ మధ్య రాజకీయం. ఎందుకంటే పార్టీలు ఈ మధ్య చేసుకుంటున్న ఆరోపణలు పై విషయాలను ధ్రువ పరుస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా నర్మగర్భంగా మాట్లాడే మంత్రి హరీష్ రావు నేరుగా ఆంధ్రప్రదేశ్ నేతలను ఉద్దేశిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా ఒకటి రెండు సందర్భాల్లో కాదు ఈమధ్య చాలా విలేకరుల సమావేశాల్లో అవే మాటలను హరీష్ రావు ఉటంకించారు.. దీనిపై జగన్ మీడియా స్పందించకపోయినప్పటికీ ఆంధ్రజ్యోతి మాత్రం ఫస్ట్ పేజీలో అచ్చేసింది. హరీష్ మాటలకు కౌంటర్ గా మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, సిదిరి అప్పలరాజు మాట్లాడారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఏదో జరిగిపోతుందని భ్రమ కల్పించారు.
వాస్తవానికి అటు జగన్ కు, ఇటు కేసీఆర్ కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తన పార్టీని రాజశేఖర్ రెడ్డి తొక్కిపడేసినప్పటికీ ఆవేవీ మనసులో పెట్టుకోకుండా 2018 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చంద్రశేఖర రావు ఆపన్న హస్తం అందించారు. అంతేకాదు కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో కూడా జగన్ ను ముఖ్యఅతిథిగా పిలిపించారు. ప్రగతి భవన్ కి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత ఇద్దరి మధ్య పోతిరెడ్డిపాడు విషయంలో గ్యాప్ ఏర్పడినప్పటికీ తర్వాత అది సమసి పోయింది. ఇటు జగన్ కూడా కేసీఆర్ పై అదే ప్రేమను కనబరుస్తున్నాడు. తన సాక్షి పేపర్ లో నమస్తే తెలంగాణ కంటే మిన్నగా కేసీఆర్ భజన చేస్తున్నాడు. ఇక ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే ఇటీవల మంత్రి కేటీఆర్ ఏపీ పాలన మీద విమర్శలు చేశాడు. అది వివాదానికి దారి తీసింది. తర్వాత కేటీఆర్ సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది.
మంత్రి హరీష్ రావు కూడా గతంలో ఎప్పుడు ఏపీ పాలన మీద విమర్శలు చేయలేదు. కానీ ఆయన ఎందుకో ఈ మధ్య ఏపీలోని విధానాల మీద విమర్శలు చేస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ కర్మగారానికి సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలో పాల్గొనేందుకు సింగరేణి అధికారులను కెసిఆర్ పంపించిన నేపథ్యంలో.. హరీష్ రావు తన మాట తీరు ఒక్కసారిగా మార్చుకున్నారు. ఏపీలో ప్రభుత్వ విధానాల పై విమర్శలను పెంచారు. అంటే ఏపీలోని బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే కేటీఆర్ ఏపీ పాలన మీద ఎటువంటి మాటలు మాట్లాడటం లేదు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా ఎటువంటి ఆరోపణలు చేయడం లేదు. కెసిఆర్ హరీష్ ద్వారా ఏపీ రాజకీయాలను నరుక్కొస్తున్నాడనే ఆరోపణలు లేకపోలేదు.

ఇక తెలంగాణ ప్రభుత్వ మంత్రుల మాటలకు ఏపీ మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఏపీలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. అప్పలరాజు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని పేర్కొన్నారు. కానీ ఈ పరిణామాలు మొత్తం చూస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం భారత రాష్ట్ర సమితి, వైఎస్ఆర్సిపి ఆడుతున్న పొలిటికల్ గేమ్ లాగా అభివర్ణిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అటు బీఆర్ ఎస్, ఇటు వైఎస్ఆర్సిపి రెండూ ఒకటేనని మండిపడుతున్నారు. ఎన్నికలవేళ తాము ఏం చేశామో చెప్పుకునే దమ్ము లేక, ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణలో ఎన్నికలకు మరికొద్ది నెలలు, ఏపీలో ఏడాది ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కడం విశేషం.