
Bandi Sanjay Remanded: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఊహించని విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పోలీసులు, ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా ఇదే కేసులో నోటీసులు జారీ చేసి, వివరణ ఇవ్వాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు షాక్ ఇచ్చారు.
సంజయ్ జైలుకు..
పదో తరగతి పరీక్షలలో హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బీజేపీకి అనుకూలంగా, బీజేపీ పార్లమెంటరీ నమో టీం లో పనిచేస్తున్న ప్రశాంత్ ప్రశ్నాపత్రాలను వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారని ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాలను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తోపాటు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారని, బండి సంజయ్‌తో వాట్సాప్ చాటింగ్, వాట్సప్ కాల్స్ మాట్లాడారని పోలీసులు మొబైల్‌లో దొరికిన ఆధారాలతో గుర్తించారు. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక సూత్రధారి బండి సంజయ్ అని అనుమానించిన పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించగా, బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు.
తాజాగా ఈటలకు..
ఇక ఇదే కేసుపై దర్యాప్తును ముమ్మరం చేస్తున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు అన్న దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచి ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్‌కు ఏమైనా పాత్ర ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈటల పీఏకు కూడా ప్రశాంత్ ప్రశ్నాపత్రాన్ని పంపినట్లుగా ఆధారాలు ఉండడంతో, పదో తరగతి పేపర్ లీక్ కేసులో ఈటల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఈటల స్టేట్మెంట్‌ను వరంగల్ పోలీసులు రికార్డు చేయనున్నారని సమాచారం. మరి పోలీసుల నోటీసులకు ఈటల రాజేందర్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

ఎవరి ఒత్తిడి మేరకు..
ప్రశ్నపత్రం అనేక మందికి ఫార్వర్డ్ అయినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. కానీ, ఆయన కేవలం బీజేపీ చీఫ్ సంజయ్, ఈటల రాజేందర్, ఆయన పీఏల పేర్లు మాత్రమే ప్రస్తావించారు. తాజాగీ ఈటలకు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో బీజేపీ మొత్తాన్ని ఇందులోకి లాగేందుకు బీఆర్‌ఎస్ వెనుక ఉండి ఈ డ్రామా ఆడిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని జాతీయ నాయకులు కూడా భావిస్తున్నారు. మరి చూడాలి ఈ లీకేజీ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతోంది.