Balakrishna- Pawan Kalyan: బాలయ్యతో మెగా హీరోలకు అంత సాన్నిహిత్యం ఉండదు. ఏదైనా ఈవెంట్లో ఎదురు పడితే మాట్లాడుకోవడమే కానీ, ప్రత్యేకంగా ఆత్మీయ కలయికలు చోటు చేసుకోవు. కాలంతో పాటు సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ మధ్య అల్లు ఫ్యామిలీకి బాలకృష్ణ చాలా క్లోజ్ అయ్యారు. అల్లు అరవింద్ కి చెందిన ఆహా యాప్ లో బాలయ్య అన్ స్టాపబుల్ షో హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో గ్రాండ్ సక్సెస్. ఇటీవల సీజన్ 2 సైతం స్టార్ట్ చేశారు. అల్లు హీరోల సినిమా వేడుకలకు బాలకృష్ణ హాజరవుతున్నారు. అల్లు రామలింగయ్య మా కుటుంబంలో మనిషిలా కలిసిపోయేవారని అలనాటి అనుబంధాలు బాలయ్య గుర్తు చేసుకుంటున్నారు.

గతంలో బాలకృష్ణ మెగా ఫ్యామిలీని సపరేట్ గా చూసేవారు. పరోక్షంగా చిరంజీవి రాజకీయ వైఫల్యాలపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాలయ్య కామెంట్స్ ని తప్పుపడుతూ నాగబాబు 2019లో సిరీస్ ఆఫ్ వీడియోలు చేశారు. చిరంజీవి ఎవరేమన్నా మనసులోకి తీసుకోరు. తనని విమర్శించిన వారు ఎదురైనా నవ్వుతూ పలకరిస్తారు. ఇక మెగా బ్రదర్స్ లో పవన్ కళ్యాణ్ నేచర్ వేరు. మనసులో ఉన్నది ఏదైనా బయటకు కక్కేస్తారు. ఆయన ప్రేమైనా ద్వేషమైనా తీవ్ర స్థాయిలో ఉంటాయి.
పవన్ కళ్యాణ్ మనసులో కూడా బాలకృష్ణ పై అసహనం ఉందనే టాక్ ఉంది. తాజా భేటీ ఈ అనుమానాలు పటాపంచలు చేస్తుంది. వీరసింహారెడ్డి సెట్స్ లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణను కలవడం పెద్ద చర్చకు దారితీసింది. సినిమాకు మించి దీన్ని రాజకీయ భేటీగా విశ్లేషకులు చూస్తున్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలతో పాటు ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే కాగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండగా రాజకీయం వేడెక్కింది.

వైసీపీ, టీడీపీ, జనసేన ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. 2019లో ప్రభావం చూపలేకపోయిన జనసేన ఈసారి కీలకం కానుంది అంటున్నారు. ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కింగ్ మేకర్ గా పవన్ అవతరించే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని పవన్ చెబుతున్న తరుణంలో ఆయన టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఏ పార్టీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ, జనసేన ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ రాజకీయ పరిణామాల మధ్య బాలయ్య-పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొననున్నారు. ఈ విషయంతో పాటు ఏపీ రాజకీయాల గురించి వీరు చర్చించుకున్నట్లు సమాచారం. 20 నిమిషాల భేటీలో పలు అంశాలు తెరపైకి వచ్చాయట. ఏది ఏమైనా పవన్-బాలయ్యల కలయిక తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది.