
Balagam Mogilaiah Health: బలగం మూవీ పతాక సన్నివేశంలో నటించిన మొగిలయ్య ఆరోగ్యం విషమించింది. ఆయనకు డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు మొగిలయ్యను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మొగిలయ్యను అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స జరుగుతుంది. కండీషన్ క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం. ఆందోళన చెందుతున్న మొగిలయ్య భార్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన భర్తకు గుండెపోటు వచ్చిందని చికిత్స అందించి కాపాడాలని ఆమె ప్రాధేయపడుతున్నారు.
మొగిలయ్యకు చాలా కాలంగా కిడ్నీ సమస్య ఉంది. ఆయనకు వారానికి మూడు రోజులు డయాలసిస్ చేయాలి. మొగిలయ్య వైద్యానికి ఇప్పటికే రూ. 14 లక్షలు ఖర్చు అయినట్లు సమాచారం. ఆరు లక్షల వరకు అప్పులు ఉన్నాయి. ఆయన పూర్తిగా కోలుకోవాలంటే రూ. 8.5 లక్షలు వైద్యానికి కావాలని మొగిలయ్య భార్య వెల్లడించారు. బలగం మూవీ డైరెక్టర్ వేణు ఎల్దండి కొంత ఆర్థిక సహాయం చేశారు. ఇటీవల మొగిలయ్య చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ ఆదేశించారు.

అయితే మొగిలయ్య శరీరం డయాలసిస్ కి కూడా సహకరించడం లేదు. తాజాగా రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆయన క్రిటికల్ కండిషన్ కి చేరారు. బలగం మూవీలో మొగిలయ్య భార్యతో పాటు పాడిన పాట సినిమాకు ప్రాణం పోసింది. నిజజీవితంలో మొగిలయ్య దంపతులది అదే వృత్తి. బుడగ జంగాలకు చెందిన ఈ భార్యాభర్తలు ఏళ్లుగా బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు.
దర్శకుడు వేణు ఎల్దండి సహజంగా ఉండేందుకు… తద్దినంలో చెప్పించే కథ మొగిలయ్య దంపతులతో పాడించారు. తండ్రి ఆత్మను ప్రతిబింబిస్తూ మొగిలయ్య దంపతులు పాడిన పాట కన్నీరు తెప్పిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగించి ఏకం చేస్తుంది. సినిమా మొత్తం ఒకెత్తు ఆ పాట ఒకెత్తు అని చెప్పాలి. బలగం మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ కాగా… అనేక అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుంటుంది.