Kothagudem: అప్పు ముప్పయితే.. అప్పు ఇవ్వడం ఇంకా పెద్ద తప్పు. ఈ సామెత ఆ యువకుడి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది. అది అతడి ప్రాణాన్ని తీసింది. అది కూడా మామూలుగా కాదు.. అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీలోని శాంతినగర్ కు చెందిన బిజెపి మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్ అశోక్ కుమార్(24). ఖమ్మం ఐటీ హబ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి భార్య అమల, రెండు నెలల పాప ఉన్నారు.. సాఫీగా సాగుతున్న అతని సంసారం.. ఒక వ్యక్తికి ఇచ్చిన అప్పు వల్ల ఆగమాగం అయింది.

అప్పు ఇచ్చుడే తప్పయింది
అశోక్ కుమార్ ది కొంచెం స్థితిమంతమైన కుటుంబం కావడంతో డబ్బుకు లోటు ఉండేది కాదు.. ఇతడు తండాలో చాలామందికి అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. ఈ క్రమంలో గుగులోతు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి అశోక్ దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునేవాడు.. ఇలా 80,000 వరకు అతని వద్ద తీసుకున్నాడు.. ప్రేమ్ కుమార్ మధ్యవర్తిగా ఉండి మరో వ్యక్తికి కూడా అశోక్ దగ్గర నుంచి అప్పు ఇప్పించాడు.. అయితే ఇందుకు సంబంధించి ప్రామిసరీ నోట్లు రాసుకున్నారు. ఆ గడువు దాటిపోవడంతో అశోక్ ప్రేమ్ కుమార్, మరో వ్యక్తిని డబ్బులు అడిగాడు. దీంతో వారు రేపు, మాపు అని దాటవేస్తూ వస్తున్నారు. అయితే ఒకరోజు అశోక్ వారిద్దరిని గట్టిగా నిలదీశాడు. దీంతో ముగ్గురి మధ్య మాటా మాటా పెరిగింది.
డబ్బులు ఇస్తానని చెప్పి
ప్రేమ్ కుమార్, మరో వ్యక్తి అశోక్ కుమార్ కు ఫోన్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పారు. మొదట్లో వారి మాటలను అశోక్ విశ్వసించలేదు. తర్వాత పదేపదే ఫోన్ చేయడంతో డబ్బులు ఇస్తారు అనుకోని వారు చెప్పిన స్థానిక పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లాడు.. డబ్బులు ఇవ్వని వారిని అడిగితే… ఇస్తామని బుకాయించారు. వారు మద్యం మత్తులో ఉండడంతో అనుమానం వచ్చిన అశోక్ అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ వారు అతడిని పట్టుకొని కొట్టారు. ముందుగా సిద్ధం చేసుకున్న కత్తులతో చేతి మణికట్టు, కాలి చీల మండల నరాల కోసి పాశవికంగా హత్య చేశారు. అయితే అశోక్ ఎంతసేపటికి ఇంటికి రాలేకపోవడంతో.. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తెలిసిన చోటల్లా వెతికారు. కానీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.. పోలీసులు, ఇల్లందు డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన పోలీసులు షాక్ కు గురయ్యారు. రక్తపు మడుగులో అశోక్ ఉండడంతో నిర్ఘాంత పోయారు. అశోక్ సోదరుడు బాలాజీ ఫిర్యాదు చేయడంతో సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు. ప్రేమ్ కుమర్ ను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ హత్యకు కారకు లైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ అతని బంధువులు ఆందోళన చేపట్టారు. అంతే కాదు ప్రేమ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. అయితే పోలీసులు వారిని శాంతింపజేశారు.

గంజాయి బ్యాచ్ పనేనా
అయితే ఈ హత్య వెనక గంజాయి బ్యాచ్ హస్తం ఉందని తెలుస్తోంది. అశోక్ ను గంజాయి తాగే వారితోనే హత్య చేయించినట్టు సమాచారం. ఈ ఘటనలో కొత్తగూడెం, ఖమ్మం నగరానికి చెందిన గంజాయి తాగే వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ప్రేమ్ కుమార్ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు తెలుస్తోంది..