Hyderabad: సాధారణంగా కిరాణం షాపు నిర్వహించే వారి ఆదాయం ఎంత ఉంటుంది? మహా అయితే రోజుకు అన్ని ఖర్చులు పోనూ వెయ్యి లేదా 2000 వరకు ఉంటుంది. ఒకవేళ పెద్ద షాపులో నిర్వహించే వారైతే రోజుకు 5000 వరకు సంపాదిస్తారు. ఇక సాదాసీదా దుకాణం అయితే చెప్పాల్సిన పనిలేదు. రోజుకు 500 కంటే ఎక్కువ మిగలవు. అయితే అలాంటి ఒక సాధారణ దుకాణం నిర్వహించే ఓ మహిళ బ్యాంకు ఖాతాలో ఏకంగా 1.63 కోట్లు ఉన్నాయి. వేరువేరు ప్రాంతాల్లో రెండు కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. ఆ కిటుకు ఏదో మాక్కూడా చెప్తే.. అనుసరిస్తామని అనుకుంటున్నారు కదా.. అయితే చదవండి ఈ కథనం.. మీకే అర్థమవుతుంది..
ఆమె పేరు నీతూ బాయ్ వయసు ఓ 50 సంవత్సరాలు ఉంటుంది. ఆమె భర్త మున్ను సింగ్ కు 53 ఏళ్ల వయసు ఉంటుంది. అయితే వీరు తమ సమీప బంధువులు సురేఖ (38), మమత (50) తో కలిసి మొత్తం 13 మంది గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. పైకి కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.. లోపల మాత్రం గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. డెకాయిట్ ఆపరేషన్ ద్వారా టీఎస్ న్యాబ్ పోలీసులు వీరిని పట్టుకున్నారు.. వీరి వద్ద నుంచి 22.6 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, 22.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తేలికగా డబ్బు సంపాదించేందుకు నీతూ బాయ్, మున్ను సింగ్ ఇతర కుటుంబ సభ్యులు ఈ గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. వీరు ధూల్ ప్రాంతానికి చెందిన అంగూరి బాయి వద్ద కిలో గంజాయిని 8000 చొప్పున కొని.. ఐదు గ్రాముల చొప్పున పొట్లాల్లో నింపి 500 కు అమ్ముతున్నారు. అలా కిలో గంజాయి విక్రయం ద్వారా 50 వేల వరకు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఖరీదైన ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, ఇతర ఆస్తులు కొనుగోలు చేశారు. గత ఏడాది అనుమానం వచ్చిన పోలీసులు నీతూ బాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆరా తీశారు. వారికి నాలుగు కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఎన్ డీ పీ ఎస్ చట్టం ప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ ఆమె వ్యవహార శైలి మారలేదు. పైగా కుటుంబ సభ్యులతో కలిసి గంజాయి విక్రయాలు సాగిస్తూనే ఉంది.