Homeట్రెండింగ్ న్యూస్Khammam: జనావాసాల్లోకి చిరుత.. మిరప తోటల్లో నక్కింది.. మేకల కాపరిని వెంటాడింది.. వైరల్ వీడియో

Khammam: జనావాసాల్లోకి చిరుత.. మిరప తోటల్లో నక్కింది.. మేకల కాపరిని వెంటాడింది.. వైరల్ వీడియో

Khammam: జనావాసాల్లోకి వస్తున్న చిరుతపులులు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. పశువులను చంపితింటున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో క్రూరమృగాల సంచారం పెరిగిపోయింది. అమ్రాబాద్ ప్రాంతంలో పెద్దపులి రోడ్డుమీదికి వచ్చి కాసేపు అటు ఇటు తిరిగి వెళ్లిపోయింది. మరోచోట ఎలుగుబంటి సంచరించింది. ఎలుగుబంటి ఏకంగా మనుషులపై దాడి చేసింది.. ఇప్పుడు ఈ జాబితాలో చిరుతపులి చేరింది.. నిర్మల్, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరులో చిరుత
పులులు సంచరించాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రవీంద్ర నగర్ ప్రాంతంలో సహ్యాద్రి కొండల ప్రాంతంలోకి మేకలను మేపడానికి ఓ వ్యక్తి వెళ్లాడు.. మేకలు అడవిలో మేత మేస్తుండగా.. అతడు చెట్టు పక్కన కూర్చున్నాడు. ఇదే క్రమంలో ఓ చిరుత అతని వద్దకు వచ్చింది. దీంతో అతడు ప్రాణ భయంతో కేకలు వేశాడు. దీంతో ఆ చిరుత పులి అక్కడ నుంచి పారిపోయింది. అయితే అంతకంటే ముందు ఆ పులి రెండు మేకలను చంపి తినేసింది. మరిన్ని మేకలను తినేందుకు మందపైకి వచ్చింది. అదే సమయంలో ఆ మేకల కాపరి అక్కడే ఉన్నాడు. దీంతో ఆ మేకలను వదిలి అతనిపైకి వచ్చింది. అయితే అతడి చేతిలో పెద్ద కర్ర ఉండడంతో చిరుతపులిని భయపెట్టాడు. ఆ తర్వాత కేకలు వేశాడు. తన మిగతా మేకలను తోలుకొని గ్రామ సమీపంలోకి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్ని గ్రామస్తులతో చెప్పాడు. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కాలి ముద్రలను పరిశీలించి.. అది మధ్యస్థ చిరుతపులి అని నిర్ధారించారు. త్వరలోనే దాన్ని పట్టుకుంటామని చెబుతున్నారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఖమ్మం జిల్లా ఏన్కూరు లో..

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి కూతవేటు దూరంలో మిరప తోటలో చిరుత పులి సంచరించింది. చిరుత పులి తోటలో నడుస్తున్న దృశ్యాలను స్థానికంగా ఉన్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఒకసారి గా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఫలితంగా తల్లాడ రేంజ్ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు, తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించారు.. మిరప తోటలో పాదముద్రల ఆధారంగా అది చిరుత పులి అని నిర్ధారించారు. అనంతరం గ్రామంలో చాటింపు వేశారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచించారు. రైతులు విద్యుత్ తీగలు, ఉచ్చులు పెట్టొద్దని హెచ్చరించారు. ఏదైనా పని ఉంటే గుంపులుగానే వెళ్లాలని వివరించారు. అయితే వీలైనంత తొందరలో ఆ చిరుతను పట్టుకుంటామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular