Annamayya: మీ థంబ్ నెయిల్ లో మన్నువడ.. అన్నమయ్యకు ఎంత తిప్పలొచ్చే

ఈ కాలంలో ఒకవేళ ఆయన బతికి ఉంటే ఇంకా తీవ్రంగా రాసేవారేమో. నానాటికి తీసి కట్టు.. నామం బొట్టు అన్నట్టుగా తెలుగు భాష పరిస్థితి మారిపోతుంటే చెంపల మీద పడేల్ పడేల్ మంటూ వాయించే వారేమో.. ఇంగ్లీష్ స్వైర విహారం చేస్తున్న ఈ కాలంలో.. తెలుగు మరుగునపడుతోంది.

Written By: Suresh, Updated On : March 12, 2024 11:05 am

Annamayya

Follow us on

Annamayya: “ఏ భాష నీది ఏమి వేషము రా
ఈ భాష ఈ వేషమెవరి కోసము రా
ఆంగ్లమందున మాటలనాగానె
ఇంత కుల్కెదవెందుకు రా
తెలుగువాడివై తెలుగు రాదనుచు
సిగ్గు లేక ఇంకా చెప్పుటెందుకు రా
అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా..”

అప్పట్లో కాళోజి నారాయణరావు రాసిన వేదన భరితమైన కవిత ఇది..

ఈ కాలంలో ఒకవేళ ఆయన బతికి ఉంటే ఇంకా తీవ్రంగా రాసేవారేమో. నానాటికి తీసి కట్టు.. నామం బొట్టు అన్నట్టుగా తెలుగు భాష పరిస్థితి మారిపోతుంటే చెంపల మీద పడేల్ పడేల్ మంటూ వాయించే వారేమో.. ఇంగ్లీష్ స్వైర విహారం చేస్తున్న ఈ కాలంలో.. తెలుగు మరుగునపడుతోంది. ఇంగ్లీష్ మోజులో తెలుగును మాట్లాడటం లేదు. తెలుగును చదవడం లేదు. తెలుగును రాయడం లేదు. ఒకవేళ రాసినా అందులో బండ తప్పులు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత తెలుగుకు మరింత తెగులు పట్టింది.

సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో చాలా వరకు మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఈ మీడియా సంస్థలు వార్తలను చేరవేసే క్రమంలో.. ఎక్కువమంది చదవాలి అనే ఉద్దేశంతో.. అడ్డగోలుగా తప్పులు చేస్తున్నాయి. తెలుగు భాష పై కనీస గౌరవం లేకుండా రాసిపడేస్తున్నాయి. తెలుగు నాట పేరుపొందిన ఓ ఆన్ లైన్ మీడియా సంస్థ అన్నమయ్య సినిమాకు సంబంధించి ఓ సన్నివేశాన్ని అద్భుతమైన థంబ్ నెయిల్ తో పోస్ట్ చేసింది. భాష మీద పట్టు లేకనో, ఇంకోటో తెలియదు గానీ.. దానికి పెట్టిన థంబ్ మెయిల్ అత్యంత దరిద్రంగా ఉంది. తెలుగు నాట శ్రీ వెంకటేశ్వర స్వామి పై వేలాది కీర్తనలు రచించిన తాళ్లపాక అన్నమాచార్యులను కాస్తా అన్నమ్మయ్య ను చేసేశారు. ఎటువంటి పరిశీలన చేసుకోకుండానే “మరదళ్ల ప్రేమలో మునిగిన అన్నమ్మయ్యకి శ్రీవారి కాలు తెరిపించారు” అంటూ అద్భుతమైన ఫాంట్ వాడారు.. మిగతా వార్తలు అంటే కొంచెం మినహాయింపు ఇవ్వవచ్చు. కానీ ఒక దేవుడికి సంబంధించింది.. వేలాది మంది చూసే దానికి సంబంధించి..థంబ్ నెయిల్ ఎలా పెట్టాలో కనీస సోయి ఉండదా? పోనీ తప్పు చేశారు ఒకసారి చూసుకో నాయనా మళ్ళీ మార్చాలి కదా.. భాష మీద నిర్లక్ష్యమా? భాష తెలియకపోవడమా? ఎలా పెడితే ఏంటి చూడక చస్తారా? అనే అశ్రద్ధా? ఇదేం తెలుగు రా భయ్.. మీ భాషలో మన్నువడ.. అన్నమయ్య ను అన్నమ్మయ్యను చేశారు.. చిన్నప్పుడు తెలుగు పాఠం బోధించిన మాస్టారు పిర్ర మీద ఒక గట్టి వాత పెడితే భాష బాగా బోధపడేది. ఇలాంటి తప్పు జరగకుండా ఉండేది.. మరీ ముఖ్యంగా తెలుగుకు తెగులు పట్టకుండా ఉండేది.