Bihar: సృష్టిలో అమ్మతనం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అమ్మకు మించిన దైవం లేదంటారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మ అనే అద్భుతాన్ని సృష్టించాడని చెబుతారు. ఇది నిజమే. తాజాగా ఓ ఘటన దీనిని రుజువు చేసింది. బీహార్ లోనిబాడ్ రైల్వే స్టేషన్ లో ఇది వెలుగు చూసింది.
రవి అనే వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు బెగుసరాయ్ నుంచి బాడ్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. విక్రమశిల ఎక్స్ప్రెస్ రైలు లో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. రైలు ప్లాట్ ఫామ్ లోకి రాగానే జనం ఎగబడ్డారు. ముందుగా రవి రైలు ఎక్కాడు. జనాల్లో ఇరుక్కుపోయిన ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో సహా కిందకు పడిపోయింది. ప్లాట్ ఫామ్ కు, పట్టాలకు మధ్యన ఉన్న సందులో ఇరుక్కుపోయింది. ఇంతలో రైలు కథలు కానీ రవి కంగారుగా కిందకు దూకేశాడు. అంగుళం దూరంలో మృత్యువుండగా.. బిడ్డలను కాపాడుకునేందుకు ఆ తల్లి ఇద్దరిని దగ్గరకు లాక్కుని రక్షణ కవచంలా వారిపై పడుకుంది. రైలు వెళ్లిపోయే వరకు అలాగే తన ప్రాణాలను పణంగా పెట్టి కదలకుండా పడుకుంది. చివరకు రైలు వెళ్లిపోవడంతో ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
బిడ్డల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కదలకుండా పడుకున్న ఆమె తెగువను భర్తతోపాటు ప్రయాణికులు రెండు నిమిషాల పాటు ఉత్కంఠతో చూశారు. ఊపిరి బిగబట్టి ఆమె శరీరానికి అత్యంత సమీపంలో రైలు వెళుతున్నా ఆమె చలించలేదు. తల్లి ప్రేమకు ఉన్న ప్రాధాన్యతను ఆమె తెలియజేశారు.ఆమెను అక్కడున్న వారు అభినందించారు. ముగ్గురికి ఎటువంటి గాయాలు తగలకుండా రైల్వే అధికారులు మాత్రం ఆసుపత్రికి తరలించారు.