swallows lizard : జైలుకు తీసుకెళ్లే క్రమంలో నిందితుడు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. వాహనంలో తీసుకెళుతున్న పోలీసులను బురిడీ కొట్టించడమో, వారిని డైవర్ట్ చేయడమో చేస్తుంటాడు. ఇటువంటి దృశ్యాలను మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. అయితే ఓ యువకుడు జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఏకంగా బల్లినే మింగాడు. అస్వస్థతకు గురైన ఆయన్ను జైలుకు కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో వెలుగుచూసిన కేసుకు సంబంధించి చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అడుగడుగునా ట్విస్టులు నడిచాయి.
యూపీలోని సద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన బాధిత తండ్రి కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. సమీప బంధువు ఒకామే తన కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు చేసిన పోలీసులు బాధితురాలు బెంగళూరులో ఉందని గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆరాతీయగా 24 ఏళ్ల మహేష్ కుమార్ బంధీగా ఉన్నట్టు తెలుసుకొని అతడి చెర నుంచి విడిపించారు. అతడు ఫతేపూర్ జిల్లా కిషన్ పూర్ కు చెందిన వాడని.. తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. కోర్టుకు తరలించిన అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించగా బల్లిని తిని అస్వస్థతకు చేరుకున్నాడు. పోలీసులు అతడ్ని ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు.
అయితే ఈ కేసులో అనేక అనుమానాలున్నాయి. బాధిత యువతిని తీసుకెళ్లిందని చెబుతున్న మహిళ ఎవరు? ఎక్కడో యూపిలో కిడ్నాప్ జరిగితే బెంగళూరు ఎందుకు తరలించినట్టు? ఇది ప్రేమ వ్యవహారమేనా? బాధిత యువతి సమ్మితితోనే యువకుడు తీసుకెళ్లాడా? అక్కడ ఇద్దరి మధ్య చెడడంతో పోలీసులకు ఫిర్యాదు వచ్చిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహేష్ కుమార్ కోలుకుంటే ఆ దిశగా దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీస్ అధికారులు చెబుతున్నారు.