
March Tollywood Movies: గత ఏడాది మార్చిలో టాలీవుడ్ కి మిశ్రమ ఫలితాలు దక్కాయి. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ డిజాస్టర్ కాగా రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది సమ్మర్ చిన్న సినిమాలదే. టాప్ స్టార్స్ చిత్రాలేవీ పూర్తి కాలేదు. దీంతో స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలకు థియేటర్స్ లభించాయి. ఎప్పటి నుండో మూలన పడి ఉన్న చిత్రాలు కూడా తీసి విడుదల చేస్తున్నారు. అయితే ఆ చిత్రాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. వచ్చిపోయినట్లు కూడా తెలియడం లేదు.
ఎంతో కొంత పేరున్న, ప్రచారం దక్కిన చిత్రాల పరిస్థితి ఏంటో చూద్దాం. మార్చి మొదటి వారంలో బలగం, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు విడుదలయ్యాయి. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తనకు కలిసొచ్చిన కామెడీ జోనర్లో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు తెరకెక్కించారు. బిగ్ బాస్ సోహైల్ హీరోగా నటించారు. రాజేంద్రప్రసాద్ కీలక రోల్ చేశారు. ఇది డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. బలగం మాత్రం అద్భుతం చేసింది. దిల్ రాజు నిర్మాత అన్న పేరు తప్పితే బలగం మూవీ మీద కూడా అంచనాలు లేవు. అయితే ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేశారు. తెలంగాణా నేటివిటీతో కుటుంబ కథను భావోద్వేగంగా చెప్పి సక్సెస్ అయ్యారు. బలగం డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.
వీటితో పాటు గ్రంథాలయం, రిచి గాడి పెళ్లి అనే చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ప్రేక్షకులకు వీటి గురించి తెలియకుండానే వెళ్లిపోయాయి. ఇక ఆస్కార్ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు రెండో వారంలో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేశారు. ఫలితం దక్కలేదు. ఆర్ ఆర్ ఆర్ తో పాటు మిస్టర్ కళ్యాణ్, దోచేవారెవరు, ఆది సాయి కుమార్ నటించిన CSI సనాతన్ విడుదలయ్యాయి. ఒక్క చిత్రం కూడా ఆడలేదు. సాయి కుమార్ తన ప్లాప్ జర్నీ కంటిన్యూ చేశాడు. గతంలో ఆయన సినిమా ఒకటి వస్తుందనైనా తెలిసేది.. CSI సనాతన్ గురించి మాట్లాడుకున్నవారే లేరు.

కన్నడ చిత్రం కబ్జ భారీ అంచనాల మధ్య విడుదలై ప్లాప్ అయ్యింది. అది డబ్బింగ్ మూవీ కాబట్టి దాని ఫలితంతో టాలీవుడ్ కి సంబంధం లేదు. నటుడు శ్రీనివాస్ అవసరాల చాలా గ్యాప్ తర్వాత మెగా ఫోన్ పట్టాడు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి డబుల్ డిజాస్టర్. హీరో నాగ శౌర్యకు ఉన్న ఇమేజ్ కూడా దెబ్బ తీసింది. శ్రీనివాస్ అవసరాల ఇకపై డైరెక్షన్ చేసే సాహసం చేయకపోవచ్చు. ఆయనలో టాలెంట్ ఉంది కానీ అది ప్రేక్షకులకు కనెక్ట్ కావడం లేదు.
ఇక నాలుగవ వారం రంగమార్తాండ, దాస్ కా ధామ్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భిన్నమైన జోనర్స్ లో తెరకెక్కిన ఈ చిత్రాల మధ్య పోటీ ఏర్పడలేదు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన రంగమార్తాండ చిత్రానికి పరిశ్రమగా అండగా నిలిచింది. చిరంజీవి వంటి పెద్దలు ప్రమోట్ చేశారు. పాజిటివ్ రివ్యూలు పడ్డాయి. ఫలితం మాత్రం శూన్యం. కృష్ణవంశీకి మరో షాక్ తప్పలేదు. దాస్ కా ధమ్కీ హైప్ కారణంగా ఓపెనింగ్స్ రాబట్టింది. దాంతో బ్రేక్ ఈవెన్ కి దగ్గరై సేవ్ అయ్యింది.
ఇక చివరి వారం దసరా చిత్రానిదే. నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఏపీలో దసరా చిత్రానికి వసూళ్లు చాలా డల్ గా ఉన్నాయి. నైజాంలో మాత్రం కుమ్మేస్తుంది. దీంతో దసరా బ్రేక్ ఈవెన్ కావడం ఖాయం. ఇక ఏ స్థాయి విజయం సాధిస్తుందో… ఫస్ట్ వీక్ ముగిస్తే కానీ తెలియదు. టాలీవుడ్ 2023 మార్చి నెల ప్రోగ్రెస్ కార్డు పరిశీలిస్తే… బలగం, దాస్ కా ధమ్కీ, దసరా చిత్ర విజయాలతో జస్ట్ పాస్ అని చెప్పొచ్చు.