Kavitha attack on BRS: పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత తన స్వరాన్ని మరింత పెంచారు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మీడియా సమావేశాలలో అంతర్గత విషయాలను చెబుతూనే ఉన్నారు. వాస్తవానికి ఈ విషయాలను చెప్పడంలో కవిత ఏమాత్రం దాపరికాన్ని ప్రదర్శించడం లేదు. వాటిని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది పడడం లేదు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె గుండెలో ఆవేదన కనిపిస్తోంది. ఆమె గొంతులో బాధ స్పష్టంగా గోచరిస్తోంది. ఇన్ని రోజులపాటు భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకురాలిగా ఉన్నప్పుడు ఆమె ఇంత ఆవేదన అనుభవించారా అని అనిపిస్తోంది.
శనివారం తన కార్యాలయంలో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి కూడా సంచలన విషయాలను వెల్లడించారు. కొత్త పార్టీకి సంబంధించి తాను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కవిత పేర్కొన్నారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితిలో ఉన్న అనేకమంది నాయకులు తనతో టచ్ లో ఉన్నారని కవిత బాంబు పేల్చారు. రాజకీయాలలో ఎవరూ స్పేస్ ఇవ్వరని.. తొక్కుకుంటూ వెళ్లాలని కవిత పేర్కొన్నారు. “ఇరిగేషన్ విషయంలో నేను ఆనాడే కేటీఆర్ కు చెప్పాను. 2016లో ఫైల్స్ మొత్తం నేరుగా సీఎం కే వెళ్తున్నాయని చెప్పాను. పిసి ఘోష్ కమిటీ నివేదిక చూస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ పెద్దలు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. నన్ను ఎవరూ సంప్రదించలేదు. అయినా నేను ఏ పార్టీలోకి వెళ్ళేది లేదు. శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. నా రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ గారిని కోరానని” కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.
కేవలం తన కుటుంబ రాజకీయాలు మాత్రమే కాకుండా.. తెలంగాణ రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా కృష్ణ నది జలాల గురించి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచుతుందని.. ఇది జరుగుతే కృష్ణానది పరివాహకంలో క్రికెట్ ఆడటం మినహా పెద్దగా ఉపయోగముండదని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రేవంత్ కృష్ణ ట్రిబ్యునల్ ముందుకు వెళ్లాలని.. తెలంగాణ వాదనలు వినిపించాలని కోరారు. గడచిన పదేళ్లలో ఆర్డీఎస్, పాలమూరు, తుమ్మిళ్ళ పథకాలను పూర్తి చేసుకోలేకపోయామని కవిత విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో అవసరమైతే తాము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కవిత పేర్కొన్నారు. ఆల్మట్టి విషయంలో ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని.. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే విధంగా స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని.. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బాధ్యత తీసుకోవాలని కవిత కుండబద్దలు కొట్టారు.
BRS Social Media నామీద దాడి చేస్తాది… హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తాది… సంతోష్ అన్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తాది
– కవిత#KalvakuntlaKavitha pic.twitter.com/UqGu1tYuwe
— M9 NEWS (@M9News_) September 20, 2025