TV9: ఈ మధ్యకాలంలో కెసిఆర్ కంటే ఎక్కువగా బిజీగా ఉంటున్నది కేటీఆర్.. అలాంటి కేటీఆర్ కూడా ఏ ఛానల్ కు ఇవ్వకుండా కేవలం టివి9 కు మాత్రమే రెండుసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని డిబేట్లు అనాలేమో. రజనీకాంత్ ఏకబిగిన గంటలపాటు పైగా ప్రైమ్ టైంలో కేటీఆర్ తో డిబేట్ కొనసాగించారు. రేటింగ్స్ రావాలని మసాలా లాంటి ప్రశ్నలు అడిగారు. అక్కడితో ఆగారా? వాళ్లకు ఉన్న డిజిటల్ వేదికలలో బిట్లు బిట్లుగా ప్రసారం చేశారు. అయినప్పటికీ ఊదు కాలలేదు.. పీరి లేవలేదు. వార్తల్లో నాణ్యత లేనప్పుడు, ప్రజెంటేషన్లో స్పష్టత కొరవడినప్పుడు కేటీఆర్ మాత్రం ఏం చేస్తారు? ఆయన వరుసగా డిబేట్లో పాల్గొంటే మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది?
రవి ప్రకాష్ ఉన్న రోజుల్లో టీవీ9 అనేది ఒక బ్రాండ్ గా వర్ధిల్లేది. న్యూస్ అంటే టీవీ9 మాత్రమే చూడాలి అని చాలామంది అనేవాళ్ళు. చాలా విషయాల్లో అతి చేసినప్పటికీ జనాలు దానిని మాత్రమే తిట్టుకుంటూ చూసేవాళ్ళు. తెలుగులో ఎన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నప్పటికీ న్యూస్ అంటే టీవీ9 మాత్రమే అనే విధంగా ముద్ర పడిపోయింది. రవి ప్రకాష్ సుదీర్ఘకాలంలో జర్నలిజం లో ఉండటంవల్ల జనాల పల్స్ పసిగట్టేవాడు. స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేవాడు. ఏదో ఒక విషయాన్ని పట్టుకొని అతివాదమో లేదా వితండవాదమో స్క్రీన్ మీద రచ్చ రచ్చ చేసేవాడు. అతడు చేసిన రచ్చ వల్ల టీవీ 9 ఆఫీస్ ముందు ధర్నాలు జరుగుతుండేవి. అప్పుడప్పుడు రేటింగ్స్ కోసం పిచ్చి గంతులు వేసినప్పటికీ జనాలు చూసేవారు. ఒకానొక సందర్భంలో రేటింగ్ తగ్గినప్పుడు శ్రీ రెడ్డి లాంటి వారి వివాదాన్ని గెలికి మరీ జనాన్ని టీవీ ముందు కూర్చునేలా చేసాడు. స్థూలంగా చెప్పాలంటే సెన్సేషన్ అంటే టీవీ9.. టీవీ9 అంటే సెన్సేషన్ అనే స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పుడున్న టీవీ 9 ఒకప్పటి టీవీ9 కాదు.
ఇప్పుడు టీవీ9 లో క్వాలిటీ అనేది పడిపోయింది. రేటింగ్ పడిపోయింది. రుధిరం తరహా జర్నలిజం అక్కడ రాజ్యమేలుతోంది. నాసిరకమైన వార్తలు, చప్పిడి వార్తలు, భజన వార్తలు తప్ప కొత్తదనం కనిపించడం లేదు. అందుకే జనం టీవీ9 ను సరిగా చూడటం లేదు. రాజకీయ పార్టీలు అయితే టీవీ9 పూర్తిగా బ్యాన్ చేశాయి. కనీసం వాట్సాప్ లో ఆ ఛానల్ యూట్యూబ్ లింక్ షేర్ చేస్తే ఎక్కడ వ్యూస్ పెరుగుతాయోమోనని అది కూడా మానేశారు. ఫలితంగా టీవీ9 హెడ్ లైన్స్ సౌండ్ కూడా జనాలకు నచ్చడం లేదు. ఆ ఛానల్ బ్రాండింగ్ పూర్తిగా పడిపోయింది. ఇప్పటికీ రవి ప్రకాష్ చేసిన కృషి వల్లే ఆ ఛానల్ కు ఆదాయం వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెవెన్యూ పూర్తిగా పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైతే ఆదాయం దండిగా వస్తోంది కాబట్టి యాజమాన్యం కూడా కంటెంట్ విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. రవి ప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత అటాప్సీ ని ఆటో స్పై అని, పోస్కో అని పలికే అపర సబ్జెక్టు మేధావులను ఎడిటర్లుగా యాజమాన్యం నియమించిన తర్వాత టీవీ9 పరిస్థితి ఇలా కాకుండా మరి ఎలా ఉంటుంది. జనాల పల్స్ పట్టుకునే విధంగా వార్తలు ఇచ్చే జర్నలిస్టులు కూడా పెద్దగా అక్కడ ఉన్నట్టు కనిపించడం లేదు. యాజమాన్యం తీరు, కొంతమంది పనితీరు నచ్చక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక టీవీ9 దుస్థితి ఇలా ఉంటే.. ఎన్ టివి పరిస్థితి మరో విధంగా ఉంది. అది రేటింగ్స్ లో దూసుకుపోతోంది. ఆ చానల్లో ఏ మాత్రం హడావిడి ఉండదు. ప్లైన్ అండ్ క్లీన్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ జనాలు దానిని విపరీతంగా ఆదరిస్తున్నారు. ఏదో ఒక వారం టీవీ9 “0.5” పెరిగితే చాలు అదే బంగారం అనుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఆ రేటింగ్స్ పడిపోతే పక్క ఛానల్ కుట్ర చేసిందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు కోట్లు ఖర్చు చేసి హోర్డింగులు పెడుతున్నారు. హోర్డింగులు పెట్టే బదులు కంపెనీలో పని చేసే ఉద్యోగులకు జీతాలు పెంచితే సరిపోతుంది కదా. నిజానికి టీవీ9 ను మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి తో కలిసి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 10 టీవీ ని కొనుగోలు చేశారు. వాళ్ళ చేతుల్లోకి వచ్చిన దగ్గరనుంచి అవన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. కన్నడ టీవీ9 కూడా అక్కడ పబ్లిక్ టీవీ దెబ్బకు వెనక్కి వెళ్ళిపోయింది. రేపో మాపో రిపబ్లిక్ కన్నడ పుంజుకుంటే మూడవ స్థానానికి వెళ్ళిపోతుంది. భారత్ వర్ష్ లాంటి నేషనల్ ఛానల్ ఆరు లేదా ఏడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రూపులో ఏ ఛానల్ పరిస్థితి సరిగ్గా లేక ప్రతినెల కోట్లకు కోట్లు ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. తెలుగులో ఓ ఓటీటీ లో జూపల్లి రామేశ్వరరావు, మెఘా కృష్ణారెడ్డి పెట్టుబడులు పెట్టారు. జూబ్లీ చెక్పోస్ట్ వద్ద ఉన్నప్పుడు అది లాభాలు భారీగానే గడిచింది. ఎప్పుడైతే టీవీ9 కొత్త బిల్డింగుకు షిఫ్ట్ అయిపోయిందో అప్పుడే అది నష్టాల బాట పట్టడం ప్రారంభమైంది. ఇక శ్రీకర ప్రొడక్షన్స్ పేరుతో రామేశ్వరరావు, కృష్ణా రెడ్డి సినిమా రంగంలోకి ప్రవేశించారు. అది కూడా కలిసి రాలేదు. కోట్లు మొత్తం హారతి కర్పూరం లాగా అయిపోయాయి. విజయ్ దేవరకొండ ప్రారంభించిన సినిమాను కూడా వద్దనుకున్నారు. అనుకున్న భక్తి ఛానల్ కూడా వాయిదా వేసుకున్నారు. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ చానల్స్ రవి ప్రకాష్ చేతిలో పెట్టడమో.. లేదా అదానీ కి అమ్మడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఆటో స్పైలాంటి వ్యక్తుల చేతుల్లో పూర్తిగా పెట్టి వదిలేయకుండా ఒక కన్నేసి ఉంచడమే యాజమాన్యానికి మంచిది. రవి ప్రకాష్ ఉన్నప్పుడు అన్ని తానయి చూసుకునేవాడు. ఏ వార్తను ఎంతసేపు టెలికాస్ట్ చేస్తే రేటింగ్స్ వస్తాయో అతడికి బాగా తెలుసు కాబట్టి ఆ విధంగా చేసేవాడు. ఫలితంగా టీవీ 9 నెంబర్ వన్ స్థానంలో కొనసాగేది. కానీ ఇప్పుడు ఆ చానల్లో అలాంటి సత్తా ఉన్న జర్నలిస్టులు లేరు. ఉన్న వారు ఆటో స్పైలాంటి జ్ఞానాన్ని తట్టుకోలేక బయటకు వెళ్లిపోయారు!
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More