KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఆయన కలవాలంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్ దొరకదు. ఆయన పిలిస్తేనే దుర్భేధ్యమైన ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయి. అపాయింట్‌మెంట్ లేకుండా వెళ్లే గేట్ల వద్ద పడిగాపులు కాసినా.. ఫలితం ఉండదు. ఇక సామాన్యుడు సంగతి అయితే దారుణం. ఏదైనా అవసరంపడి, ఆపద వచ్చి ముఖ్యమంత్రికి మొర పెట్టుకుందామని వెళితే.. గేటు దరిదాపుల్లోకి కూడా వెళ్లే అవకాశం ఉండదు. బలవంతంగా వెళ్దామని ప్రయత్నిస్తే జైలుకు వెళ్లడమే. కేసులపాలై కోర్టు చుట్టూ దిరగడమే. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాణ కసం గొంగలి పురుగును కూడా కౌగిలించుకుంటానన్న కేసీఆర్.. తెలంగాణ వచ్చిన తర్వాత ఈగ కూడా తన ఆజ్ఞ లేకుండా ప్రగతి భవన్ అడుగుపెట్టకుండా చేశాడు. జనాన్ని కలిసిన దాఖలాలు లేవు. కేసీఆర్ పాలన నిజాం రాజరికాన్ని తలపిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దొరల గడీలా ప్రగతి భవన్ మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ముఖ్యమైనమంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్, సీఎం ప్రజలను ఎందుకు కలవడం లేదో క్లారిటీ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR : కేసీఆర్ సామాన్య ప్రజలను అందుకే కలవరట!
వ్యవస్థ విఫలమైనట్టే అట..
సమస్యలసై ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాడనికి వస్తే ఆ సమస్య పరిష్కరించే ప్రభుత్వ వ్యవస్థ విఫలమైనట్టే అని కేసీఆర్ అభిప్రాయపడ్డారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వివిధ విభాగాల్లో 6.5 లక్షల మంది ఉద్యోగులు కింద నుంచి పైదాకా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంతమంది ఉన్నా.. ఒక వ్యక్తి సీఎంను కలవడానికి వచ్చాడంటే ఆ విభాగంలో పనిచేసే ఉద్యోగుల అలసత్వం, నిర్లక్ష్యమే అని పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే సీఎం ప్రజలను కలవడం లేదట. పింఛన్ రావడం లేదని, భూమి రికార్డులోకి ఎక్కలేదని, ఇళ్లు కావాలని, నల్లా కావాలని, డ్రెయినేజీ సరిగా లేదని, భూమి కావాలని ముఖ్యమంత్రిని అడిగే పరిస్థితి రావొద్దన్నదే కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు. ప్రతీ ప్రభుత్వ విభాగం సమర్థవంతంగా పనిచేయడానికే కేసీఆర్ ప్రజలను కలవడం లేదని తెలిపారు. దీనిని ఉద్యోగులు, అధికారులు అర్థం చేసుకోవాలని సూచించారు.
వ్యవస్థ పనిచేస్తున్నందుకే అవార్డులు..
‘దేశ జనాభాలో తెలంగాణ జనాభా కేవలం 3 శాతమే. కానీ దేశం ప్రకటిస్తున్న అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వస్తున్నాయి. పట్టణాలకు ఇచ్చే పురస్కారాలు కూడా తెలంగాణ మున్సిపాలిటీలకే దక్కుతున్నాయి. అంటే వ్యవస్థ బాగా పనిచేస్తుంది కాబట్టే అవార్డులు వరిస్తున్నాయి’ అన్నారు కేటీఆర్. వ్యవస్థలన్నీ సంక్రమంగా పనిచేస్తున్నాయి కాబట్టే అవార్డులు తెలంగాణను వరిస్తున్నాయన్నారు. ప్రతీ అధికారికి వ్యవస్థపై పట్టు ఉందని, ఎవరి విధులు వారు నిర్వహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. పదేళ్లలో గల్లా ఎగరేసి చెప్పుకే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ వ్యవస్థలే కారణమన్నారు. అందుకే తెలంగాణ ఆదర్శ రాష్ట్రం అయిందని పేర్కొన్నారు. అన్నీ బాగున్నప్పుడు ముఖ్యమంత్రిని కలవాల్సి అవసరం ఏంటని ప్రశ్నించారు.
ఇవేంటి కేటీఆర్‌గారు..
కేటీఆర్ తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి బాగా గొప్పగా చెప్పుకొచ్చారు. ప్రజలను కలవకపోవడంపైనా కేసీఆర్‌కు బదులు.. కేటీఆరే సమాధానం ఇచ్చారు. పరోక్షంగా ఉద్యోగులను హెచ్చరించారు కూడా. ఇంత వరకు బాగానే ఉంది. కానీ అందరూ నల్లా కోసమో, పింఛన్ కోసమో.. భూమి కోసమో, ఇల్లు కోసమో రారనే విషయం కేటీఆర్‌కు తెలియంది కాదు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని ఉద్యమకారులు వస్తున్నారు. కంచే చేను మేస్తున్న చందంగా అధికారులు, ప్రజాప్రతినిధులే భూ కబ్జాలు చేస్తున్నారు. తెలంగాణలో ఇవి ఎక్కువయ్యాయి. ఇసుక, మొరం దోపిడీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఇసుక లారీలను అడ్డుకున్నారని పోలీసులలో దళితులను కొట్టించి ఉదంతం ఉంది. పైసలు ఇవ్వనిదే పని చేసే ప్రభుత్వ వ్యవస్థ ఆదర్శ రాష్ట్రంలో మచ్చుకైనా కనిపించడం లేదు. ధరణితో బాధలతో రైతులు ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకేనే నాథుడు లేడు. పోడు రైతులను గర్భిణులు, బాలింతలను జైల్లో పెట్టిన ఘటన అటవీ అధికారులదే. దళితులకు మూడెకరాల భూమి లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు లేవు.. మీరు ఇచ్చిన ఎన్నో హామీలు అమలు కాలేదు. ఇవ్వన్నీ చెప్పుకునేందు విపక్షాలు, ప్రజలు, బాధితులు ప్రగతి భవన్‌కు వస్తారు. కానీ కేటీఆర్ నాలుగు చిన్న సమస్యలను చెప్పి.. ముఖ్యమంత్రి అందుకే కలవడం లేదని కప్పిపుచ్చుకోడం నవ్విపోదురుగాని నాకేటి సిగ్గు అన్నట్లు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.