Jupalli Krishna Rao : తెలంగాణలో ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉన్నాయి. కానీ ఇప్పటికే రాజకీయ వాతావరణం చాలావరకు వేడెక్కింది. భారత రాష్ట్ర సమితి నుంచి తొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకమైన స్వరం వినిపిస్తున్నారు.. దీంతోపాటు ఇంకా కొంతమందిని చాలా జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే నిన్న మొన్నటిదాకా వీరంతా కూడా బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అందరూ భావించారు. కానీ తాము ఆ పార్టీల్లో చేరబోయేది లేదని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన మనసులో ఉన్న పలు విషయాలను పంచుకున్నారు.
కన్నీళ్లు మిగిలాయి
జూపల్లి కృష్ణారావు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్హౌస్ వెళ్లారు. తాను వచ్చానని వర్తమానం పంపారు. అయినప్పటికీ ఫామ్ హౌస్ తలుపులు తెరుచుకోలేదు. ఇది జూపల్లిని బాధించింది. 2018 ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితి నాయకులు తన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు. అందువల్లే నేను ఓడిపోయానని కృష్ణారావు కుండబద్దలు కొట్టారు. ” పద్యాలు చెబుతాడు. కవితలు వల్లె వేస్తాడు. 80 వేల పుస్తకాలు చదివి తాను మేధావి అనుకుంటాడు. చదివేస్తే ఉన్న మతి పోయినట్టు.. ముఖ్యమంత్రికి మతిభ్రమించి ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నాడని” జూపల్లి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ఇదే ఆఖరు అవుతుందని స్పష్టం చేశారు.
లక్ష్యం ఒక్కటే
బిజెపిలో చేరుతామా?, కాంగ్రెస్ లోకి ప్రవేశిస్తామా? అనేది చర్చ అవసరం. కానీ మా ముందు ఒక లక్ష్యం ఉంది. పెద్దపెద్ద నాయకులం మొత్తం ఏకమయ్యాం. కెసిఆర్ ఓటమికి అనుగుణంగా పనిచేస్తామని జూపల్లి స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్, విజయశాంతి, ఇంకా కొంతమంది నాయకులు మాతో కలిసి వస్తారని పరోక్షంగా జూపల్లి వ్యాఖ్యానించారు. అంతటి కేసీఆర్ ను తట్టుకుని నిలబడగలరా అనే ఆర్కే ప్రశ్నకు.. కలోగంజి తాగి బతుకుతాం.. అంతకుమించి కేసీఆర్ మమ్మల్ని ఏం చేయగలరు అని జూపల్లి స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
రాయబారాలు పంపలేదు
తన ఉద్యమ నాయకుడిగా ఉన్నానని, తనను ఓడించేందుకు కుట్రలు జరిగినప్పటికీ నేను ఎక్కడా బయట పెట్టలేదని జూపల్లి వ్యాఖ్యానించారు. గతంలో పార్టీ మారే విషయాన్ని సంబంధించి కెసిఆర్ మాట్లాడినప్పుడు.. 1000 కోట్లు ఇచ్చినా అమ్ముడుపోనని నాడు కెసిఆర్ కు చెప్పానని జూపల్లి గుర్తు చేసుకున్నారు. మీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఆర్కే ప్రశ్నించగా.. దానికి మౌనమే సమాధానంగా జూపల్లి తల ఊపారు. ఇంకా ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలను ఆర్కే ఎన్నో సంధించారు. మరి వాటికి జూపల్లి ఎలాంటి సమాధానాలు చెప్పారో పూర్తి ఎపిసోడ్ చూస్తే గాని తెలియదు.