https://oktelugu.com/

KCR : కేసీఆర్ ఎక్కడ? పెద్దాయన రావాలి? కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు?

కేసీఆర్ మాటలు వినబడి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. ఆయన కనిపించడం లేదు. ఆయన మాట వినిపించడం లేదు. కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని భావిస్తున్నారా? లేకుంటే వ్యూహాత్మకమా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ లో ఇదే ఆసక్తికరమైన చర్చ.

Written By:
  • Srinivas
  • , Updated On : September 21, 2024 / 12:34 PM IST

    KCR

    Follow us on

    KCR :  కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు తూటాల్లా పేలుతాయి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తాయి. అచ్చమైన తెలంగాణ మాండలికంతో చేసే కామెంట్స్ ముచ్చెమటలు పట్టిస్తాయి. అన్నింటికీ మించి తెలంగాణ ప్రజలకు నచ్చుతాయి. కానీ ఆ మాటలు వినబడి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. ఆయన కనిపించడం లేదు. ఆయన మాట వినిపించడం లేదు. కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని భావిస్తున్నారా? లేకుంటే వ్యూహాత్మకమా? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ లో ఇదే ఆసక్తికరమైన చర్చ.

    దశాబ్దకాలం ఆయనే అంతా..
    తెలంగాణ రాకముందు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్ తన ప్రసంగాలతో రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకట్టుకోగలిగారు. ఆయన సభలో మాట్లాడబోతున్నారంటే అందరూ టీవీల ముందు కూర్చునే పరిస్థితి ఉండేది. అలా.. ఉద్యమం చేసే చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టగలిగారు. ఇక రాష్ట్రం ఏర్పాటు నుంచి దశాబ్దకాలం పాటు ఆయన పార్టీకి తిరుగులేకుండా పోయింది. ఏ ఎన్నిక వచ్చినా కూడా గులాబీ జెండానే రెపరెపలాడింది. అటు.. ప్రభుత్వంలోనూ తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు. దశాబ్ద కాలం పాటు అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ ఆయన చెప్పిందే నడిచింది.

    ఫామ్‌హౌజ్ దాటని కేసీఆర్
    దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్.. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా పదవి కోల్పోవాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి ఆయన ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆయనకు సంబంధించిన ఫామ్‌హౌజ్‌లోనే కాలం గడుపుతున్నారు. నేతలతో సమీక్షలైనా.. ఎవరైనా కలవాలన్నా.. అంతా అక్కడే. అంతే తప్పితే ఇంతవరకు బయట కనిపించ లేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరుగుతోంది. కేసీఆర్ మళ్లీ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారా..? అని. అయితే.. రాజకీయ చాణక్యుడిగా పేరున్న కేసీఆర్.. ఇలా ప్రజల్లోకి రాకుండా ఉండిపోవడం పైనా పలు కారణాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఆయన రాజకీయ చతురతలో భాగమేనని ఆయన అభిమానులు అంటున్నారు.

    కాంగ్రెస్ ప్రభుత్వంపై నో కామెంట్స్
    మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు కావస్తోంది. ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు చాలా సందర్భాల్లో ఆరోపిస్తూ వచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలను సగం వరకే తీర్చారని, ప్రజల హామీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అంటున్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపైనా ఇంతవరకు కేసీఆర్ మాట్లాడలేదు. ముందు నుంచీ సైలెంటుగానే ఉండిపోయారు. రైతుబంధు, రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. కేసీఆర్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సీనియర్ నేతగా, ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో తమ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినప్పటికీ కేసీఆర్ మౌనంగానే ఉండిపోయారు.

    బీఆర్ఎస్ పథకాలపై విచారణ
    అయితే.. కాంగ్రెస్ కొలువుదీరినప్పటి నుంచి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తోంది. వాటిని మీద విచారణలు నడుస్తున్నాయి. ఆ విచారణ పూర్తయ్యే వరకు ఇలా సైలెంటుగా ఉండిపోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారా..? అనే టాక్ సైతం నడుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ రిటైర్డు జస్టిస్‌తో విచారణ చేపట్టింది. అలాగే జీఎస్టీ స్కామ్ పైనా విచారణ జరుగుతోంది. ఇంకా గొర్రెల స్కీమ్‌పైనా ఆరోపణలు వచ్చాయి. ఇటీవల మరో మంత్రి.. మిషన్ భగీరథలోనూ రూ.20వేల కోట్ల అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. అయితే.. ఎంతసేపూ ప్రభుత్వం బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచాలని ప్రయత్నిస్తున్న తరుణంలో వాటికి దీటైన బదులివ్వాలని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లోనే ఉండి వ్యూహరచన చేస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతారని అంటున్నారు. మరోవైపు.. ఆయన రాకకోసం కింది స్థాయి కార్యకర్తల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అలాగే.. పార్టీలకతీతంగా ఉన్న అభిమానులు సైతం ఆయన తొరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. పెద్దాయన రావాలి.. మళ్లీ పార్టీకి ఊపు తీసుకురావాలని కోరుతున్నారు.