Real estate trends 2025: దేశ రియల్ ఏస్టేట్ మార్కెట్ ఈ ఏడాది పరిమాణం కంటే విలువపై దృష్టి పెట్టింది. ఇళ్ల అమ్మకాల సంఖ్య తగ్గినా, మొత్తం విక్రయ విలువ గణనీయంగా పెరిగి రికార్డులు సృష్టించింది. దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఇళ్ల అమ్మకాలు 9–12 శాతం క్షీణించాయి. అయితే, విక్రయాల మొత్తం విలువ 14 శాతం పెరిగింది. రూ. 1.52 లక్షల కోట్లకు చేరింది. ఖరీదైన గృహాలపై ఆసక్తి పెరగడం వల్ల ఈ మార్పు సాధ్యమైంది.
లగ్జరీ ఇళ్లకు డిమాండ్..
మధ్యస్థ ధరల ఇళ్లకు డిమాండ్ తగ్గగా, రూ. 1.5 నుంచి రూ.4 కోట్ల పైగా ధరల లగ్జరీ, ప్రీమియం గృహాలు 28 శాతం పెరిగాయి. సంపన్నులు, ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు ఈ రంగాన్ని ముందుకు నడిపాయి. నిర్మాణ ఖర్చుల పెరుగుదల సామాన్య హౌసింగ్‌ను ప్రభావితం చేసింది.
హైదరాబాద్ మార్కెట్ పునరుజ్జీవనం
హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల విక్రయాలు ప్రారంభంలో 25 శాతం పడిపోయినా, సంవత్సర చివరిలో పుంజుకున్నాయి. గచ్చిబౌలి, కోకాపేట్‌లో చదరపు అడుగుకు ధరలు రూ. 9,100 నుంచి రూ. 13,000 వరకు పెరిగాయి. పశ్చిమ భాగం అత్యధిక డిమాండ్ చూపింది.
ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 6–16 శాతం పెరిగాయి. ఆఫీస్ స్పేస్ లీజింగ్ కూడా బలపడింది. 2026లో వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశంతో మధ్యతరగతి గృహాలు మళ్లీ ఆకర్షణ పొందనున్నాయని నిపుణులు అంచనా.