HomeతెలంగాణNirmal : జోరు వర్షం.. చిమ్మ చీకటి.. లోయలోకి దూసుకెళ్లిన కారు.. అదిగో అప్పుడే జరిగింది...

Nirmal : జోరు వర్షం.. చిమ్మ చీకటి.. లోయలోకి దూసుకెళ్లిన కారు.. అదిగో అప్పుడే జరిగింది ఓ అద్భుతం..

Nirmal : జోరు వర్షం.. చిమ్మ చీకటి.. లోయలోకి దూసుకెళ్లిన కారు.. అదిగో అప్పుడే జరిగింది ఓ అద్భుతం..

Nirmal  : భూమ్మీద నూకలు ఉంటే చాలు.. బ్రహ్మ దేవుడు గీసిన ఆయుష్షు రేఖ బలంగా ఉంటే చాలు.. నరకపు చివరి అంచులకు వెళ్లినా కూడా బతికి రావచ్చు అంటారు పెద్దలు. అలాంటిదే వీరి జీవితంలో కూడా జరిగింది. లేకపోతే వాళ్లు ఎదుర్కొన్న ప్రమాదం నుంచి బయట పడడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. పైగా వారు ప్రమాదానికి గురైన ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోది. పైగా అది దట్టమైన ఆడవి. ఒక మాటలో చెప్పాలంటే సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అంతంత మాత్రమే. అలాంటి చోట ప్రమాదానికి గురి కావడం.. బతికి బయట పడటం.. మామూలు విషయం కాదు. ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత వారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. తమను కాపాడిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఏం జరిగిందంటే

శనివారం అర్ధరాత్రి.. అప్పటికి సమయం రెండు గంటలు దాటింది. జోరున వర్షం కురుస్తోంది. దానికి తోడు దట్టమైన మేఘాలు.. వాతావరణంలో మార్పుల వల్ల పొగ మంచు కూడా అలముకుంది. ఈ సమయంలో ఆ రోడ్డుమీదుగా ఒక కారు వేగంగా వెళ్తోంది. సరిగ్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామం సమీపంలో మహబూబ్ ఘాట్ లో అదుపుతప్పింది. అతివేగం వల్ల ఎడమవైపు వెళ్లాల్సిన కారు కుడివైపు మళ్ళింది. అక్కడ ఉన్న ఒక లోయలోకి దూసుకుపోయింది. కారు వేగానికి ఏకంగా 200 అడుగుల దిగువకు వెళ్ళింది. ఒక టేకు చెట్టుని ఢీ కొట్టి అక్కడే నిలిచిపోయింది.. అదే సమయంలో కారులో ఉన్న బెలూన్లు తెరుచుకోవడంతో అందులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ప్రమాద తీవ్రత వల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో.. అందులో ప్రయాణిస్తున్న వారికి అర్థం కాలేదు. అయితే బతికి బట్ట కట్టామనే భావన మాత్రం వారిలో ఉంది. తీవ్ర భయాల మధ్య ఆ సమయంలో వారు డయల్ 100 కు ఫోన్ చేశారు. ఆ తర్వాత అద్భుతం జరిగి.. వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

హైదరాబాద్ నగరానికి చెందిన అనగన మండల రాధాకృష్ణ, ఆయన భార్య వెంకట దుర్గ, కుమారుడు ప్రేమ్ సాయి కారులో మహారాష్ట్రలోని నాగ్ పూర్ బయలుదేరారు. అక్కడ వారి బంధువుల ఇంట్లో వేడుక ఉండడంతో.. దానికి హాజరయ్యేందుకు వారు కారులో ప్రయాణమయ్యారు. రాధాకృష్ణ కారు నడుపుతున్నాడు. కారు నిర్మల్ పట్టణం దాటి సుమారు పది కిలోమీటర్లు వచ్చింది. మహబూబ్ ఘాట్ పరిధిలోకి వచ్చింది. ఇదే సమయంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. ఆ సమయంలో కారు విపరీతమైన వేగంతో ఉంది. ఫలితంగా లోయలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రాధాకృష్ణ కుటుంబ సభ్యులు డయల్ 100 కి ఫోన్ చేశారు.. దీంతో నిర్మల్ డిసిఆర్బి సిఐ గోపీనాథ్, సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్, డ్రైవర్ ముగ్గురు వెంటనే ఘటన స్థలానికి వెళ్లారు. కారులో ఉన్న వారంతా ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించారు. వారిని పైకి తీసుకొచ్చేందుకు 101 కు ఫోన్ చేసి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు కూడా తక్షణమే ఘటన స్థలానికి వచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద తాడు సహాయంతో రాధాకృష్ణ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఘాట్ పైకి తీసుకొచ్చారు. అప్పటికి సమయం మూడు గంటల 15 నిమిషాలు అవుతోంది.

అదే ప్రమాదానికి కారణం

కడ్తాల్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రాధాకృష్ణ తప్పుడు అంచనా తో నిర్మల్ పట్టణం మీదుగా మహబూబ్ ఘాట్ వైపు కారు మళ్ళించారు. ఆ సమయంలో వారు జాతీయ రహదారి మీదుగా ప్రయాణం చేస్తే మహబూబ్ ఘాట్ తగిలేదికాదు.. తప్పుడు అంచనా తో కారును మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగింది. చావు చివరి అంచు దాకా వెళ్లి.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో రాధాకృష్ణ కుటుంబ సభ్యులు బతికి బట్టకట్టారు. వాస్తవానికి ఆ ప్రమాదం జరిగిన తీవ్రతకు బతికేందుకు 0.1% కూడా బతికే అవకాశం లేదు. కానీ రాధాకృష్ణ కుటుంబ సభ్యులు అత్యంత తెలివిగా డయల్ 100 కు ఫోన్ చేయడం.. పోలీసులు స్పందించడం.. 101 కు పోలీసులు ఫోన్ చేస్తే అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవడం.. వంటి ఘటనలు చక చకా జరిగిపోవడంతో రాధాకృష్ణ కుటుంబ సభ్యులు పునర్జన్మ పొందారు. అయితే ఈ ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క స్పందించారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సీఐ గోపీనాథ్, ఎస్సై శ్రీకాంత్, అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. త్వరలో వారిని అవార్డులకు సిఫారసు చేస్తామని ఆమె ప్రకటించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular