CM Revanth Reddy: ఆ మధ్య హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు కు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫస్ట్ క్లాస్ చదివి ఓ పిల్లాడికి 1,50,000 ఫీజు అతని తండ్రి చెల్లించాడంటూ ఒక ఫోటో చక్కర్లు కొట్టింది. ఫస్ట్ క్లాస్ చదువు పిల్లాడికి అంత ఫీజా అంటూ చాలామంది నోళ్ళు వెళ్ళబెట్టారు. ఫస్ట్ క్లాస్ కే 1,50,000 తీసుకుంటే.. టెన్త్ కు అయితే 10 లక్షలు వసూలు చేస్తారా అంటూ.. కొంతమంది కామెంట్లు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ఫీ జులుం కు సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన విద్య సదుపాయాలు లేకపోవడం.. ఒకవేళ ఉన్నా.. ఉపాధ్యాయులు సక్రమంగా బోధించకపోవడంతో.. చాలా వరకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. గురుకులాలు, మోడల్ స్కూల్స్, సెకండరీ పాఠశాలలు, గురుకుల కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు వంటి వాటిని నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ.. అందులో ప్రమాణాల స్థాయి అంతంత మాత్రమే. పైగా ప్రజాప్రతినిధులు తమ పిల్లల్ని పేరుపొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదివిస్తుంటే మిగతా ప్రజలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తమ పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? సో .. యథా రాజా.. తథా ప్రజా.
ఇక ప్రభుత్వాలు సరిగా పట్టించుకోకపోవడంతో కార్పొరేట్ విద్యా ముఠా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తోంది. కనీసం ఫీజుల విషయంలో ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా పోయింది. గతంలో హైదరాబాద్ వంటి నగరానికే పరిమితమైన కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ళు.. నేడు సాధారణ పట్టణాలలోనూ తమ శాఖలు ఏర్పాటు చేశాయి.. తామరతంపరగా కళాశాలలు, స్కూళ్ళు పుట్టుకు రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని అందులోకే పంపించాల్సిన అనివార్యత ఏర్పడింది.
ఇక ఈ కార్పొరేట్ ముఠా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుందని ముందే చెప్పుకున్నాం కదా.. అయితే ఆ ఫీజుల విషయంలోనూ వాటి ఇష్టారాజ్యమే. ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కార్పొరేట్ కాలేజీలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో పలు కాలేజీల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు ముకుతాడు వేసేందుకు రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కార్పొరేట్ కాలేజీ లపై కొరడా ఝళింపించేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం. కాలేజీలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయకుండా కొత్త చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం కోనట్టు సమాచారం. ఎన్నికల అనంతరం శాసనసభలో చట్టాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని సమాచారం.. ఒకవేళ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కార్యరూపం దాల్చితే కార్పొరేట్ ముఠాకు దాదాపు ముకుతాడు పడినట్టే.