Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో తమ ప్రాంతాల్లో తక్కువ ఓల్డేజ్, విద్యుత్ స్తంభాలు లేదా వైర్లు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్ సమస్యలు వంటివి అధికారులకు తెలిపేందుకు ఫిర్యాదు చేయవచ్చును. ఈ ఫిర్యాదును నేరుగా కాకుండా ఆన్లైన్లోనే చేసే అవకాశం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం విద్యుత్ శాఖ డిజిటల్ సేవలను విస్తృతంగా అందిస్తోంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ఆన్లైన్లో ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా ఫోన్ ద్వారా, వాట్సాప్ లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తుంది. కొన్ని విద్యుత్ సంస్థలు ప్రత్యేకంగా డిజిటల్ యాప్ లను ఏర్పాటు చేసి వినియోగదారుల ముందు ఉంచుతున్నాయి. వీటి ద్వారా కూడా ఫిర్యాదు చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా, ఇతర సమస్యలను ఫిర్యాదు చేయాలంటే TGNPDCL యాప్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేనివారు ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. అందుకోసం ఈ సంస్థ వారు 1912 అనే నెంబర్ ఏర్పాటు చేశారు. అలాగే 18004250028 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అయితే ఫిర్యాదు చేసే వ్యక్తి పూర్తి వివరాలు, చిరునామా అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తమ ప్రాంతంలో ఉన్న సర్వీస్ నెంబర్ కూడా అందిస్తే సమస్య పరిష్కారానికి మరింత సులభంగా మారుతుంది.
దక్షిణ తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించుకునేందుకు TGSPDCL అనే యాప్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే యాప్ ఉపయోగించలేని వారు ఈ ప్రాంతంలోని వారు కూడా 1912 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
అయితే వినియోగదారులు తప్పుడు సమాచారం ఇవ్వకుండా తమ వివరాలను కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేసే వరకు ఆయా ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ విద్యుత్ వైర్లు తెగిపడితే అటువైపు వెళ్లకుండా ఉండాలి. ముఖ్యంగా వర్షం కురిసినప్పుడు విద్యుత్ వైర్లను గమనిస్తూ వెళ్లాలి. ఈ సమయంలో ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండడమే మంచిది.