Telangana Phone Tapping Case 2025: తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసులోల ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి. ఏడాదికాలంగా దీనిపై సిట్ విచారణ జరుపుతోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు అమెరికా పారిపోవడంతో విచారణ ఆలస్యమైంది. ఆయనను ఇండియాకు రప్పించిన సిట్.. ఇప్పుడు విచారణలో దూకుడు పెంచింది. నిందితులను విచారణ చేస్తూనే.. బాధితుల స్టేట్‌మెంట్ రికార్డు చేస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సినీతారలు, రాజకీయ నేతలు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను దేశ చరిత్రలోనే అత్యంత హేయమైనదిగా అభివర్ణించిన ఆయన, బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీఆర్‌ఎస్‌పై విమర్శల వర్షం..
మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసి, వ్యక్తిగత గోప్యతను భంగపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీతారల వ్యక్తిగత జీవితాల్లో చిచ్చు పెట్టడం, జడ్జీలు, అధికారులతోపాటు బీఆర్‌ఎస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం ద్వారా అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి, అదే సమయంలో రాజకీయ వర్గాల్లో ఈ ఆరోపణల నిజానిజాలపై చర్చ రేగింది.
గోప్యతపై దాడి..
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నైతిక, చట్టపరమైన ఉల్లంఘనలను లేవనెత్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం, పౌరులకు గోప్యత హక్కు ఒక ప్రాథమిక హక్కు. అనుమతి లేకుండా ఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడం టెలిగ్రాఫ్ చట్టం, ఐటీ చట్టం కింద నేరంగా పరిగణించబడుతుంది. మహేశ్ కుమార్ గౌడ్ ఈ చర్యను ‘హేయమైనది‘గా పేర్కొనడం ద్వారా, బీఆర్‌ఎస్ నాయకత్వం చట్టపరమైన బాధ్యతల నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు. సినీతారలు, అధికారులు, రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలపై దాడి చేయడం వారి ప్రతిష్ఠకు, మానసిక ఆరోగ్యానికి చేటు చేసిందని పేర్కొన్నారు.
సినీతారల సంసారాల్లో చిచ్చు..
మహేశ్ కుమార్ గౌడ్ సినీతారల ఫోన్ల ట్యాపింగ్‌ను ప్రస్తావించడం ఈ వివాదానికి కొత్త కోణాన్ని జోడించింది. సినీ పరిశ్రమలోని ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై దాడి చేయడం ద్వారా వారి కుటుంబ సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపణలు సమాజంలో తీవ్ర చర్చను రేకెత్తించాయి. సినీతారలు సామాజిక ప్రభావం కలిగిన వ్యక్తులు కావడంతో, వారి గోప్యత భంగం విస్తతమైన ప్రజా ఆందోళనకు కారణమవుతుంది. ఈ ఆరోపణలు నిజమైతే, బీఆర్‌ఎస్ ప్రభుత్వం సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తవచ్చు.
రాజకీయ కోణం..
మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కేవలం ఆరోపణలతో ఆగక, రాజకీయ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను రక్షణాత్మక స్థితిలోకి నెట్టడం ద్వారా, కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశాన్ని లేవనెత్తడం ద్వారా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేయవచ్చు. అయితే, ఈ ఆరోపణలకు బీఆర్‌ఎస్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం. ఒకవేళ బీఆర్‌ఎస్ ఈ ఆరోపణలను ఖండిస్తే, ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.