Telangana : పదోతరగతి వార్షిక పరీక్షల విధానంపై పాఠశాల విద్యాశాఖ గురువారం(నవంబర్ 28న) కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేసింది. ఇక నుంచి ఇంటర్నల్ మార్కులను తొలగించి వార్షిక పరీక్షలను 80కి బదులు 100 మార్కులకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మార్పులో భాగంగా ఐదు పరీక్షలకు 24పేజీల బుక్‌లెట్ (అన్సర్ షీట్) ఇవ్వనుండగా, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్‌కు మాత్రం 12 పేజీల చొప్పున అందజేయనున్నారు. సైన్స్, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రానికి ఒక్కో దానికి 50 మార్కుల చొప్పున కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మేధావులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే బాగుండేదని పలువురు భావించారు. ఏకపక్షంగా నిర్ణయంతో విద్యార్థులు నష్టపోతారన్న విమర్శలు వచ్చాయి.
అశాస్త్రీయంగా ‘ఇంటర్నల్’..!
ఇదివరకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను పరిశీలించేందుకు విద్యాశాఖ ప్రత్యేక బృందాలతో తనఖీలు నిర్వహించేది. ఆయా పాఠశాలల్లో అశాస్త్రీయంగా ఇంటర్నల్ మార్కులు వేశారనే ఆరోపణలు రాగా.. వాస్తవ పరిస్థితిపై పరిశీలనకు బృందాలను నియమించారు. ప్రై వేట్, ప్రభుత్వ బడుల్లో అంతర్గత మార్కులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్కూల్ పొందుపర్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రతీ పేపర్‌కు 80 మార్కులు, మరో 20 మార్కులు విద్యార్థుల ప్రావీణ్యత ఆధారంగా ఇంటర్నల్ మార్కులతో విద్యాశాఖ కలిపేది. ఆయా పాఠశాలలు ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ) పేరిట విద్యార్థులు చేసే ప్రాజెక్ట్ వర్క్, స్కూల్ నిర్వహించే స్లిప్ టెస్ట్ ఆధారంగా మార్కులు వేశేవారు. ఆయా పాఠశాలలు 20 మార్కులకు 19 మార్కులకు పైగా వేసిన సందర్భాలు లేకపోలేదు. ప్రై వేట్ పాఠశాలల్లో ఫార్మెటివ్ టెస్ట్‌లో విద్యార్థికి తక్కువగా వచ్చినా, ప్రాజెక్టులు చేయకపోయినా గరిష్ట మార్కులు వేయటం విమర్శలకు తావిచ్చింది. మార్కులపై ఒక్కో బృందానికి పీజీహెచ్‌ఎంతో పాటు లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ బృందం ప్రాజెక్ట్ వర్క్, నోట్‌బుక్‌లో రాసిన చూచిరాత, ఎప్‌ఏ–1, 2లో వచ్చిన ఫలితాలపై పరిశీలన నామమాత్రంగా సాగినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ, విమర్శల నేపథ్యంలో యూటర్న్ తీసుకుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి..
పదో తరగతి పరీక్షల విధానాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై విద్యాశాఖ వెనక్కు తగ్గింది. పబ్లిక్ ఎగ్జామ్స్‌లో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేత నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చే విద్యా సంవత్సరం (2025–26) నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం ఇంటర్నల్ మార్కులు 20, పరీక్షల మార్కులు 80 ఉంటాయని పేర్కొంది.