WhatsApp Meeseva Services: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది. ఫిర్యాదులు, దరఖాస్తులు వాట్సాప్ ద్వారా చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వ సేవలు చాలా వరకు వాటా‍్సప్‌లో అందుతున్నాయి. తిరుమల సేవల కూడా వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ‘మీ సేవ’ సేవలను ఆధునికరించడంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పౌరులు మీ సేవ సెంటర్లకు పదేపదే వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా దరఖాస్తుల స్థితి, సర్టిఫికేట్లను నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక వ్యవస్థను ప్రభుత్వం మంగళవారం(నవంబర్ 18న) అధికారికంగా ప్రారంభించనుంది.
చాట్ ద్వారా సేవలు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పౌరులు వివిధ ప్రభుత్వ ధ్రువపత్రాల కోసం మీ సేవ కేంద్రాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో జనన, మరణ, ఆదాయ, కులం, నివాస సర్టిఫికెట్లు, పింఛన్లు, లైసెన్సులు వంటి పత్రాలు ఉంటాయి. అయితే ముందుగా దరఖాస్తు చేసి, వాటి స్థితి తెలుసుకోవడానికి మళ్లీ కేంద్రానికే వెళ్లడం సాధారణం. ఇప్పుడు అదే సమాచారం వాట్సాప్ సందేశం రూపంలో నేరుగా పౌరుల మొబైల్‌కి చేరుతుంది. ఎప్పుడు దరఖాస్తు అప్రూవ్ అయ్యింది, ఏ స్థితిలో ఉంది, అధికారులు తిరస్కరించారా అనే వివరాలన్నీ ఒక్క సందేశంతో అందుతాయి.
సర్టిఫికేట్ కూడా వాట్సాప్‌లోనే..
దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే సర్టిఫికేట్ లింక్ వాట్సాప్‌లో వస్తుంది. పౌరులు ఆ లింక్ ద్వారా డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా మీ సేవ సెంటర్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా అవుతాయి. అదనంగా ఆధికారులకు కూడా పని సులభం అవుతుంది. దరఖాస్తు స్థితి రియల్‌టైమ్‌లో కనబడటంతో అవినీతి అవకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు కొత్త ప్రమాణంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజల చేతుల్లో ప్రభుత్వం..
ఈ సౌకర్యాన్ని తెలంగాణ ఐటీ, సేవలు శాఖ రూపొందించింది. సేవలు మొబైల్ ఆధారితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే ‘తీ–హబ్’, ‘తీ–వర్క్స్’, ‘తీ–వాలెట్’ వంటి పథకాలను విజయవంతంగా నడుపుతోంది. వాట్సాప్ మీ సేవ అందించడంతో ప్రజల చేతుల్లో ప్రభుత్వం అనే నినాదం మరో అడుగు ముందుకేసినట్లవుతోంది. సాంకేతికతను పాలనలో వినియోగించడం తెలంగాణ ప్రభుత్వానికి కొత్త విషయం కాదు. అయితే వాట్సాప్ వేదికగా ప్రభుత్వ సర్టిఫికెట్ల డెలివరీ ప్రారంభం కావడం దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా మారే అవకాశం ఉంది.