Telangana Elections 2023: ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒక్క ఓటుతోనూ అభ్యర్థుల తలరాతలు తారుమారు అవుతుంటాయి. అందుకే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. అభ్యర్థుల గెలుపోటముల్లో ఒక్క ఓటు కూడా కీలకమే. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాచ్‌పేయి.. కేవలం ఒక్క ఓటు తేడాలో లోక్‌సభ విశ్వాసం కోల్పోయారు. ప్రభుత్వ ంకూలిపోయింది. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఒక్కటి.. చాలా చాలా చిన్న అంకె. అందుకునేమో చాలామంది దానిని తేలికగా తీసుకుంటారు. కానీ, గెలుపోటముల విషయానికొచ్చేసరికి మాత్రం ఆ ‘1’ ఎంతో ఎంతో కీలకంగా మారుతుంటుంది. పరీక్షల్లో ఒక్క మార్కు, ఆటలో ఒక్క పరుగు, ఎన్నికల్లో ఒక్క ఓటు.. అంతెందుకు చరిత్రలో ఒక్క ఓటుతో ప్రభుత్వం కుప్పకూలడం కూడా చూశాం. ఎన్నికల్లోనూ ఒక్క ఓటుతో ఓడిన నాయకుల చరిత్రను ఒక్కసార తిరగేస్తే.. ఓటు విలువేంటో కచ్చితంగా తెలియడం ఖాయం.
ఒక్క ఓటుతో ఓడిన ఎమ్మెల్యేలు..
– 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నాథ్‌ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడారు. సీపీ జోషికి 62,216 ఓట్లు పోల్‌కాగా.. జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఓటమి గురించి చర్చ జరిగింది. ఎందుకంటే సీపీ జోషి అప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉండడం మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ఎన్నికపై జోషి కోర్టుకు ఎక్కారు. ప్రత్యర్థి చౌహాన్ భార్య రెండు పోలింగ్ బూత్‌లలో ఓటేసినట్లు ఆరోపించారు. రాజస్థాన్ హైకోర్టు జోషికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. సుప్రీం కోర్టులో మాత్రం వ్యతిరేక ఫలితం దక్కింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన నియోజకవర్గంలో తానే గెలుపును చవిచూడలేకపోయారాయన. ఫలితంగా.. రెండోసారి అశోక్ గెహ్లాట్ సీఎం పదవి చేపట్టారు. జోషి ఎన్నిక వ్యవహారంలో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఉంది. సీపీ జోషి తల్లి, సోదరి, ఆఖరికి ఆయన కారు డ్రైవర్ కూడా అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేకపోయారు.
– ఇక కర్ణాటకలో ఓడిన కృష్ణమూర్తి విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఆయన కారు డ్రైవర్ ఆయనకు ఓటేయలేదు. ఓటేసేందుకు కృష్ణమూర్తిని డ్రైవర్ అనుమతి అడిగినా.. పోలింగ్ రోజు కావడంతో కుదరని డ్యూటీలోనే ఉంచారట. ఫలితం.. ఒక్క ఓటు ఆయన్ని ఓటమిపాలయ్యారు. అందుకే రాజకీయ ప్రత్యర్థులెవరికీ కూడా ఇలాంటి ఓటమి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు ఆయన చెబుతూ వచ్చేవారు.
సింగిల్ డిజిట్ ఓట్ల తేడాతో..
ఇక సింగిల్ డిజిట్ ఓట్లతోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. 2018 మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తుయివావ్ల్ నిజయోకవర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్‌ఎల్ పియాన్మావాయి కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రత్యర్థి మిజోరాం నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్‌చాందమా రాల్తేకు 5,207 ఓట్లు రాగా.. పియాన్మావాయికి 5,204 ఓట్లు పోలయ్యాయి. దీంతో రీకౌంటింగ్‌కు ఆయన పట్టుబట్టినా.. అక్కడా అదే ఫలితం వచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లోనూ..
అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాదు.. లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండుసార్లు ఇలా సింగిల్ డిజిల్ ఓటములు ఎదురైన సందర్భాలు నమోదు అయ్యాయి. 1989లో అనకాపల్లి(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) నిజయోకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తొమ్మిది ఓట్ల తేడాతో నెగ్గారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో.. బీహార్ రాజ్‌మహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మారండి కేవలం 9 ఓట్ల తేడాతోనే నెగ్గారు. 192 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది మంది ఎంపీలు లోక్‌సభకు కేవలం సింగిల్ లేదంటే డబుల్ డిజిట్ ఓట్లతో నెగ్గారు.