HomeతెలంగాణTelangana Budget 2024: 2.90 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌?.. ఆ శాఖలకే అధిక కేటాయింపులు!

Telangana Budget 2024: 2.90 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌?.. ఆ శాఖలకే అధిక కేటాయింపులు!

Telangana Budget 2024: బడ్జెట్‌.. ఏ రాష్ట్రానికి అయినా.. దేశానికి అయినా కీలకం. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగడానికి బడ్జెట్‌ ప్రభుత్వాలకు ఉపయోగపడుతుంది. అందుకే ప్రభుత్వాలు ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మందే బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తాయి. మార్చి 31 వరకు ఈ బడ్జెట్‌ అమలులో ఉంటుంది. వార్షిక బడ్జెట్‌లో జరిగే కేటాయింపు ఆధారంగానే వివిధ శాఖల ద్వారా పథకాలు, అభివృద్ధి చేపడతారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపత్యంలో గత ఫిబ్రవరిలో రేవంత్‌ సర్కార్‌ 2024–25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలికి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టిన ‘ఓట్‌–ఆన్‌–అకౌంట్‌’ బడ్జెట్‌ గడువు ఈ నెల 31తో ముగియనుండడంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం(జూలై 25న) ప్రవేశపెట్టబోతోంది. ఈమేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిసింది. ఈ మేరకు శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షించారు. ఆయా శాఖలు తమ ప్రాధమ్యాలను వివరించగా.. ప్రభుత్వం కూడా బడ్జెట్‌పై ఒక అంచనాకు వచ్చింది. గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభానికి ముందే కేబినెట్‌ సమావేశం నిర్వహించి బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌–1లో మంత్రి మండలి సమావేశమవుతుందని సీఎస్‌ శాంతికుమారి ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇక శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్‌..
ఇదిలా ఉండగా జూలై 23న పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరాశపర్చింది. ప్రత్యేక కేటాయింపుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండుసార్లు ఢిల్లీవెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. తమ రాష్ట్రానికి కావాల్సిన నిధులపై వినతిపత్రం అందించారు. కానీ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ వినతులు, ప్రతిపాదనలను పట్టించుకోలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర బడ్జెట్‌లో అసలు తెలంగాణ పేరే వినిపించలేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను కలుపుకుని బడ్జెట్‌లో స్వల్ప మార్పులు చేయాలని. కానీ, కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం నిరాశపర్చింది.

ఆ శాఖలకే భారీగా నిధులు..
ఆరు గ్యాంరటీలు, రుణమాఫీ, రైతుభరోసా, నీటిపారుదల, సంక్షేమం తదితర శాఖలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షల క ఓట్లతో బడ్జెట్‌ రూపొందించినట్లు సమాచారం. ఇక ఈ బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకే భారీ కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యంగా రుణమాఫీకి రూ.31 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.15 వేల కోట్లు, రైతు బీమాకు మరో రూ.7 వేల కోట్ల వరకు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. పాత బకాయిల చెల్లింపు, పాలమూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల ఆవశ్యకత దృష్ట్యా సాగునీటి పారుదల శాఖ ఈసారి రూ.29 వేల కోట్ల వరకు ప్రతిపాదనలను సమర్పించింది. ఇక ఆరు గ్యారెంటీల్లోని రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. వీటికి ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేయనుంది. కేంద్ర బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజన కింద రాష్ట్రానికి వచ్చే నిధులను పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులను ఖరారు చేయనుంది. ఇక సంక్షేమ శాఖకు రూ.40 వేల కోట్లు, వైద్య శాఖకు రూ.15 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular