Telangana Assembly Elections 2023 : ఓ వైపు కాంగ్రెస్ మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించింది. రెండో విడతకు రంగం సిద్ధం చేసుకుంటోంది. బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ప్రకటించింది. బీఫారాలు కూడా అందజేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు చోట్ల ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. పనిలోపనిగా ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. పోటీ పార్టీలు ఇలా ఉంటే.. మొన్నటి దాకా రేసులో ఉండి, తర్వాత తప్పుకుని బీజేపీ తిప్పలు పడుతోంది. అంతే కాదు కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించుకోలేకపోతోంది. దీంతో ఆ పార్టీలో నైరాశ్యం అలముకుంది.
ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ఉధృతం చేస్తుంటే.. తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల ఎప్పుడన్నది కమలం ఆశావహుల్లో ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఆలస్యం ప్రభావం కేడర్‌పైనా పడుతోందని.. ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లకుండా వారిని కాపాడుకోవడం తమకు సవాల్‌గా మారిందని పలువురు ఆశావహులు, సీనియర్ నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా అభ్యర్థిత్వం కోసం ముగ్గురు, నలుగురు నేతలు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ టిక్కెట్టు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. కానీ, పార్టీ నాయకత్వం తొలి జాబితానే ఇంకా ప్రకటించకపోవడంతో అసలు తమకు టికెట్ వస్తుందో లేదో అన్న ఆందోళన వారిలో పెరుగుతోంది. జాబితా ప్రకటించకున్నా.. అభ్యర్థిత్వంపై పార్టీ ముఖ్యనేతల నుంచి సైతం తమకు విస్పష్ట హామీ లభించడం లేదని చాలామంది వాపోతున్నారు. ప్రచారసమరానికి అన్ని ఏర్పాట్లూ చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నా.. చివరి నిమిషంలో ఏదో కారణంతో టిక్కెట్టు రాకపోతే ఏంటి పరిస్థితి? అని కూడా ఆలోచించాల్సివస్తోందని పేర్కొంటున్నారు.
సర్వేనా.. దరఖాస్తుల ప్రాతిపదికనా?
వచ్చే ఎన్నికల్లో గట్టి అభ్యర్థుల కోసం బీజేపీ మళ్లీ సర్వే చేపట్టింది. పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే జరుగుతోంది. దీంతో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సెప్టెంబరు 29 నుంచి మంచిరోజులు లేకపోవడంతో, ఈ నెల 14వరకు అభ్యర్థుల తొలి జాబితా ఉండదని పార్టీ ముఖ్యనేతలు, ఆశావహులకు చెప్పారు. దీంతో 15 లేదా 16న ఒక జాబితా వెలువడవచ్చని వారు అంచనా వేశారు. ఇప్పుడేమో.. మరో రెండు, మూడు రోజులు గడచిన తర్వాతే తొలి జాబితా ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతుండడంతో వారికి టెన్షన్ పెరిగింది. నిజానికి బీజేపీ.. ఈసారి ప్రత్యేక కౌంటర్ పెట్టి మరీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆశావహులు ఏ స్థాయివారైనా దరఖాస్తు చేసుకోవాల్సిందే అని పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. ఇప్పుడేమో సర్వే ఆధారంగానే టిక్కెట్లు అనడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే.. ఇటీవల బీజేపీలో చేరిన ఒకరిద్దరు నేతలకు టిక్కెట్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ‘‘ఇలా చేస్తే.. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న మాలాంటి సీనియర్‌లకు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది? అంతకుముందు, సర్వే ప్రాతిపదికనే సీట్లని ఘంటాపథంగా ప్రకటించిన ముఖ్యనేతలపై స్థానిక కేడర్‌కు ఎలాంటి అభిప్రాయం ఉంటుంది?’’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. కొన్ని చోట్ల సీటు కోసం ముగ్గురు, నలుగురు పోటీపడుతుంటే.. మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి గట్టి అభ్యర్థులు దొరకడం కష్టమవుతోందని పార్టీ మరో సీనియర్ నేత అంగీకరించారు.
ఉదాహరణకు వనపర్తి నియోజకవర్గం నుంచి పార్టీకి గట్టి అభ్యర్థి లేరు. దీంతో, బీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలపై తాము ఆశలు పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలోని మెజారిటీ సెగ్మెంట్లలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అని ఆయన వివరించారు. కాగా.. అంబర్‌పేట నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇక.. రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ముషీరాబాద్ నుంచి పోటీ చేయకపోవచ్చని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరు పోటీ చేసినా కలిసికట్టుగా పనిచేయాలని లక్ష్మణ్, నియోజకవర్గ ముఖ్యులతో రెండురోజుల కిందట నిర్వహించిన సమావేశంలో పిలుపునివ్వడంతో, ఆయన పోటీ చేసే అవకాశాల్లేవని భావిస్తున్నారు.
జనసమీకరణా.. చూద్దాం!
టిక్కెట్ల అంశం ఎటూ తేల్చకపోవడంతో పలువురు బీసీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ఎన్నికల వేళ, రాష్ట్రస్థాయి సదస్సులకు ఎవరు జనాన్ని తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఈ నెల 29న బీసీ గర్జన సభను ప్రతిపాదించింది. దీనికి ఏర్పాట్లు, జనసమీకరణపై పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించగా.. దానికి హాజరైన పలువురు బీసీ నేతలు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారానికే ఎక్కువ మంది వెళుతున్నారని వారు పేర్కొన్నారు.