Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకే జై.. కాంగ్రెస్ కే ఎమ్మెల్సీ సీటు

పట్టభద్రులు ఎమ్మెల్సీ కౌంటింగ్‌ సుదీర్ఘంగా జరిగింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎనలిమినేషన్‌ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు.

Written By: Raj Shekar, Updated On : June 8, 2024 9:52 am

Teenmar Mallanna

Follow us on

Teenmar Mallanna: వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రులు చేతి గుర్తుకు జైకొట్టారు. ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చిన చింతపండు నవీన్‌కుమార్‌(తీన్మార్‌ మల్లన్న) విజయం సాధించారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్‌లో ఎలిమినేషన్‌ ప్రక్రియ తర్వాత బీజేపీ బలపర్చిన ప్రేమేందర్‌రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం తేలింది. బీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన రాకేశ్‌రెడ్డి కన్నా తీన్మార్‌ మల్లన్నకు 14 వేలకుపైగా మెజారిటీ వచ్చింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాకా మల్లన్న గెలిచినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ధ్రువీకరణ పత్రం అందించారు. గత నాలుగు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది.

సుదీర్ఘ కౌంటింగ్‌..
పట్టభద్రులు ఎమ్మెల్సీ కౌంటింగ్‌ సుదీర్ఘంగా జరిగింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు శుక్రవారం అర్ధరాత్రి ముగిసింది. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎనలిమినేషన్‌ ప్రక్రియ వరకు మల్లన్నకు రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఎలిమినేషన్‌ ప్రక్రియయలో రాకేశ్‌రెడ్డి, మల్లన్నకంటే సుమారు 4 వేల వరకు ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్పటికే మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18 వేలపైచిలుకు ఆధిక్యం ఉండడంతో గెలుపు మల్లన్ననే వరించింది.

20 వేల ఓట్లలో కానరాని రెండో ప్రాధాన్యం
ఇదిలా ఉండగా స్వతంత్ర అభ్యర్థి, నాలుగో స్థానంలో ఓట్లు సాధించిన పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి కలిపి తొలి ప్రాధాన్య ఓట్లు 73,110 రాగా, వీటిలో సుమారు 20 వేల బ్యాలెట్‌ పత్రాల్లో ఆ ఓటర్లు రెండో ప్రాధాన్య ఓటు వేయలేదు. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థుల రెండో ప్రాధాన్య ఓట్లు తనకే వస్తాయని ధీమాగా ఉన్న రాకేశ్‌రెడ్డి ఆమేరకు ఓట్లు కోల్పోయి.. ఓటమిని అంగీకరించారు.

నాలుగో ప్రయత్నంలో చట్ట సభకు..
ఇక తీన్మార్‌ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ఒకసారి శాసనసభకు కూడా పోటీ చేశారు. తొలిసారి 2015లో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2019లో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2021లో మళ్లీ పట్టభద్రుల ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తాజాగా ఉప ఎన్నికల్లో మూడోసారి బరిలో నిలిచి విజయం సాధించారు. మల్లన్న స్వగ్రామం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌.