Teenmar Mallanna: ఏపీలో పక్కన పెడితే.. తెలంగాణలో రాజకీయ పార్టీలు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. గతంలో వివిధ పార్టీలు మారిన వారు.. ఆ పార్టీల ద్వారా పదవులు పొందిన వారు కొత్త రాజకీయ క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో తీన్మార్ మల్లన్న కూడా ఒకడు. గతంలో తీన్మార్ మల్లన్న బిజెపిలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయ్యారు. కొంతకాలానికి ఆ పార్టీకి వ్యతిరేక స్వరం వినిపించడం మొదలుపెట్టారు. చివరికి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతూనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో తన పార్టీని విస్తరించే పనిని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. అధ్యక్షులను నియమిస్తున్నారు.
తాజాగా తీన్మార్ మల్లన్న తన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో భవిష్యత్తు విధివిధానాలను ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సమావేశం ముగిసిన తర్వాత కార్యకర్తలతో తీన్మార్ మల్లన్న బయటికి వచ్చారు.. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీన్మార్ మల్లన్న పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి మాట్లాడారు. ఒక కార్యకర్త అయితే వీరావేశంలో మాటలు మాట్లాడారు. తీన్మార్ మల్లన్న దేశానికి ప్రధానమంత్రి అవుతాడని.. తెలంగాణ నుంచి ఆ అదృష్టాన్ని పొందిన వ్యక్తి అవుతాడని పేర్కొన్నారు. అంతేకాదు తీన్మార్ మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆ కార్యకర్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
తీన్మార్ మల్లన్న పార్టీ కార్యకర్తలు చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..” మొదట్లో బిజెపిలో ఉన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అందులో ఎమ్మెల్సీ అయ్యాడు. చివరికి పార్టీ తీసుకున్న విధానాలను ప్రశ్నించాడు. ఆ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి దానికి మాత్రం రాజీనామా చేయలేదు. ఇప్పుడేమో రాజకీయ పార్టీ పెట్టాడు. రాజకీయ పార్టీ పెట్టి కొద్ది రోజులు కూడా కాకముందే తన కార్యకర్తలకు భజనలు అలవాటు చేశాడు. తనని ఏకంగా ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా చేసేసుకున్నాడు. ఇది మామూలు కామెడీ కాదు. వాస్తవానికి ఎవరైనా సున్నా నుంచి ఎదుగుతారు. తీన్మార్ మల్లన్న మాత్రం ఏకంగా ప్రధానమంత్రి పీఠానికి సూటి పెట్టాడని” నెటిజన్లు అంటున్నారు.
ఆమధ్య ఓ సామాజిక వర్గం వారిని తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న ను ఉద్దేశించి ప్రధానమంత్రి అని వ్యాఖ్యలు చేసిన వీడియో బయటకి రావడంతో ఆ సామాజిక వర్గం వారు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్సీ గా ఉన్న వ్యక్తి ప్రధాన మంత్రి ఎలా అవుతాడంటూ ఎద్దేవా చేస్తున్నారు.