Supreme Court on BRS MLAs: బెల్లం ఎక్కడ ఉంటే.. చీమలు అక్కడ ఉంటాయి.. అలాగే అధికారం ఎక్కడ ఉంటే.. నేతలు అక్కడ ఉంటారు.. ఇది ప్రజాస్వామ్యం. తెలంగాణలో ఇదే జరిగింది. 2023 ఎన్నికల ముందు వరకు బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడింది. దీంతో ఆ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ను వీడి.. అధికార కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. గురువారం(జూలై 31న) కీలక తీర్పు వెల్లడించింది.
Also Read: ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రాంగం.. ఏంటి కథ?
మూడు నెలల గడవు..
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం (జులై 31) ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తాజాగా మరో మూడు నెలల గడువు విధించింది.
పార్టీ ఫిరాయింపులు..
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు డానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, ఎం.సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాకరామరాఆవు(కేటీఆర్), బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2024 జూన్, జులైలో స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంతో బీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు స్పష్టమైన గడువు..
2024 సెప్టెంబర్ 9న తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, స్పీకర్ నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ నిర్ణయించాలని ఆదేశించారు. అయితే, నవంబర్ 2024లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను రద్దు చేస్తూ, స్పీకర్ ‘‘సమంజసమైన సమయంలో’’ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు 2025 జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు డెడ్‌లైన్..
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం 2025 ఏప్రిల్ 3న వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. జులై 31, 2025న వెలువరించిన తీర్పులో, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను రద్దు చేస్తూ, స్పీకర్ మూడు నెలల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన గడువు విధించింది. న్యాయస్థానమే అనర్హత వేటు విధించాలన్న బీఆర్‌ఎస్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ, స్పీకర్‌కు రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేసింది. ‘‘అపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్’’ వంటి పరిస్థితి ఉండకూడదని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
Also Read: తెలంగాణలో ఎకరం 100 కోట్ల పైనే.. ఎక్కడో తెలుసా?
సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ సంస్థల మధ్య సమతుల్యతను కాపాడే ప్రయత్నం చేసింది. స్పీకర్‌కు రాజ్యాంగ హక్కులను అర్థం చేసుకుంటూ, నిర్ణయం తీసుకోవడంలో జాప్యం రాజకీయ పార్టీల హక్కులను దెబ్బతీస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మూడు నెలల గడువు నిర్దేశించడం ద్వారా, స్పీకర్‌పై ఒత్తిడి పెరిగింది, అదే సమయంలో న్యాయస్థానం స్వయంగా అనర్హత నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగ సరిహద్దులను గౌరవించింది. మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేస్తారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరం!