Sircilla Collector Transferred: మొత్తానికి రేవంత్ రెడ్డి మీద భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విజయం సాధించారు. తను అనుకున్నది నెరవేర్చుకున్నారు. అంతేకాదు సిరిసిల్ల ప్రజలు ఏకంగా టపాసులు పేల్చారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.. వాస్తవానికి ఒక అధికారి బదిలీ అయితే ఈ స్థాయిలో ప్రజలు సంబరాలు జరుపుకోవడం దాదాపు తొలిసారి కావచ్చు.
సిరిసిల్ల కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సందీప్ కుమార్ ఝా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల విషయంలో నిరంకుశంగా ప్రవర్తించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల ప్రజా పాలన దినోత్సవం జరిగినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని.. మిడ్ మానేరు నిర్వాహకురాలికి పరిహారం ఇచ్చే విషయంలో సందీప్ కుమార్ అడ్డగోలుగా ప్రవర్తించారనే విమర్శలు వినిపించాయి. దీనికి తోడు ప్రజాప్రతినిధులకు సరైన స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది. చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ పై సందీప్ కుమార్ సరిగ్గా స్పందించకపోవడంతో.. ఆయన నేరుగా ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి ఆది శ్రీనివాస్ అత్యంత దగ్గర వ్యక్తి కావడంతో మరో మాటకు తావులేకుండా చర్యలకు ఉపక్రమించారు. సందీప్ కుమార్ ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో హరితను నియమించారు.
సందీప్ కుమార్ ఝా పై ఎప్పటి నుంచో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని.. అనవసరమైన విషయాలలో సందీప్ కుమార్ వేలు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన సిరిసిల్ల వచ్చిన ప్రతి సందర్భంలోనూ సందీప్ కుమార్ పై విమర్శలు చేసేవారు. కలెక్టర్ ను బదిలీ చేయాలని డిమాండ్ కూడా చేశారు. అయితే అప్పట్లో కేటీఆర్ అనుచరులు చేసిన భూ అక్రమాలను బయటపడుతున్నందుకే కలెక్టర్ మీద కక్ష కట్టారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ వ్యవహార శైలి బయటికి రావడంతో కేటీఆర్ చేసినవి ఆరోపణలు కాదని.. నిజాలని తేలింది. చివరికి కలెక్టర్ తప్పు తెలిసి.. ప్రభుత్వం బదిలీ చేసింది. వాస్తవానికి ఒక కలెక్టర్ స్థాయి అధికారి బదిలీ అయితే ప్రజల సంబరాలు చేసుకోవడం తెలంగాణ చరిత్రలో తొలిసారి. అయితే అటువంటి వ్యక్తికి అధికారిగా కొనసాగే అవకాశం ఉందా? అనే ప్రశ్న నే ఇప్పుడు తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.