RK Kottapaluku: ఇక తాజాగా కొత్త పలుకులో వేమూరి రాధాకృష్ణ ఏమాత్రం దాపరికాన్ని ప్రదర్శించలేదు. తనకు దగ్గర వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెనకేసుకురావడానికి ప్రయత్నించలేదు. అలాగని న్యాయవ్యవస్థను ప్రశ్నించడానికి వెనుకాడ లేదు. మొత్తంగా కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అసలు విషయాన్ని వేమూరి రాధాకృష్ణ బయటపెట్టాడు..” ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఫార్ములా వన్ రేస్ నిర్వాహన కోసం ఐఎంజీ భారత్ అనే సంస్థకు 400 ఎకల కేటాయించారు. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఈ 400 ఎకరాలు తీసుకున్నారు. మరోచోట 397 ఎకరాలు కేటాయించారు. అయితే ఐ ఎం జి భారత్ అనే సంస్థ ఇంతవరకు అందులో కార్యకలాపాలు మొదలుపెట్టలేదు. దీనిపై ప్రభుత్వం న్యాయపోరాటం మొదలు పెట్టింది. 25 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఆ కేసు గెలిచింది. ఫలితంగా 400 ఎకరాల భూమి ప్రభుత్వం సొంతమైంది. వనరుల సమీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆ 400 ఎకరాలను విక్రయించాలని భావించింది. ఆ 400 ఎకరాలు 25 సంవత్సరాలుగా పడావుగా ఉన్నాయి కాబట్టి.. అది ఒక అడవిలాగా పెరిగింది. అందులో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. సహజంగా ఇలాంటి అప్పుడు ఆ భూమి చుట్టూ కంచ ఏర్పాటు చేసి.. ఆ భూమి ప్రభుత్వానిదని ప్రకటించి.. అందులో ఉన్న వన్యప్రాణులను ఇతర ప్రాంతాలకు తరలించి.. చెట్లను చదను చేస్తే బాగుండేది. కానీ ఇలా చేయకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జెసిబి లతో ఆ ప్రాంతం మీదకి వెళ్లడం ఒకసారిగా కలకలం సృష్టించింది. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది.. అటు కోర్టులు కూడా రంగంలోకి దిగడంతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని” రాధాకృష్ణ రాసుకొచ్చారు.
Also Read: సన్నబియ్యం ఇచ్చారు.. పేదోడి ఇంట భోజనానికి వెళుతున్నారు..
అలా చేసి ఉంటే..
ఆ 400 ఎకరాలకు సెంట్రల్ యూనివర్సిటీతో సంబంధం లేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు. కాకపోతే ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అంతేకాదు విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 4 00 ఎకరాలను ఎవరి కొనుగోలు చేసినా వెనక్కి తీసుకుంటామని అన్నారు. దీనిని రాధాకృష్ణ తీవ్రంగా తప్పు పట్టారు. ఒకసారి భూమిని కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి వెనక్కి తీసుకురావడం అంత సులభం కాదని విషయం కేటీఆర్ కు తెలియదా అని రాధాకృష్ణ గుర్తు చేశారు. ఐ ఎం జి భారత్ నుంచి 400 ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి 25 సంవత్సరాలు పట్టిందని.. ఆ విషయం కేటీఆర్ మర్చిపోయారా అంటూ రాధాకృష్ణ మందలించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించిన వ్యవహారంలో ఎవరిని రాధాకృష్ణ వదిలిపెట్టలేదు. అడ్డగోలుగా పథకాలు ప్రకటించడం మొదలుపెట్టిన నాయకులకు ప్రభుత్వ భూములు అమ్మడం తప్ప మరొకటి తెలియడం లేదని రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.. కాకపోతే ఇవాళ ఎందుకో రాధాకృష్ణలో పూర్తిస్థాయిలో పాత్రికేయుడు కనిపించాడు. న్యాయ వ్యవస్థను తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డిని దునుమాడాడు. రేవంత్ రెడ్డిది లేడికి లేచిందే పరుగు అనే వ్యవహార శైలి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈవారం కొత్త పలుకులో ఎటువంటి పచ్చ వాసనలను రాధాకృష్ణ ఒంట పట్టించుకోలేదు కాబట్టి.. చదవడానికి బాగుంది.. ఇదే టెంపో రాధాకృష్ణ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ ఆయన అలా చేయడు. అలా చేస్తే ఆయన రాధాకృష్ణ ఎందుకు అవుతాడు.