Telangana teacher facial recognition attendance: తెలంగాణలో పదేళ్లు విద్యారంగం నిర్లక్ష్యానికి గురైంది. బీఆర్‌ఎస్ పాలనతో ఎన్నికలకు ఏడాది ముందు మన ఊరు మన బడి లాంటి కార్యక్రమాలు చేపట్టినా.. అవి పూర్తయ్యేలోపే ఎన్నికలు వచ్చాయి. అయితే ఇదేసమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకులాలకు ప్రాధాన్యం ఇచ్చింది. విద్యార్థులకు సామాజికవర్గాలుగా విభజించింది. అయితే ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల జోలికి వెళ్లలేదు. కథ నడుస్తోంది అన్నట్లుగా.. కర్ర విరగకుండా.. పాము చావకుండా వ్యవహరించింది. ఈతరుణంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అడ్మిషన్ల పెంపు బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించిన ప్రభుత్వం.. తాజాగా గురువులను కూడా గాడిలో పెట్టాలని నిర్ణయించింది.
టెక్నాలజీ అటెండెన్స్..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల హాజరును క్రమబద్ధీకరించేందుకు ఆగస్టు 1, 2025 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనుంది. గత కొన్నేళ్లుగా, కొంతమంది టీచర్లు విధులకు గైర్హాజరు కావడం, హాజరు రిజిస్టర్లలో తప్పుడు నమోదులు చేయడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జగిత్యాల జిల్లాలో ఒక టీచర్ 20 సంవత్సరాల పాటు విధులకు హాజరు కాకుండానే జీతం పొందిన ఘటన ఈ సమస్య యొక్క తీవ్రతను బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం టీచర్ల హాజరును కచ్చితంగా ధ్రువీకరించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను ఎంచుకుంది. ఈ విధానం సర్కారీ బడులు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని 1.20 లక్షల మంది టీచర్లకు వర్తిస్తుంది.
Also Read: సంధి కుదిరింది.. రేవంత్ కు నవ తెలంగాణ “ఎర్రతివాచీ”..
ప్రయోజనాలు ఇవీ..
ఈ సాంకేతికత ద్వారా హాజరు ప్రక్రియ ఆటోమేటెడ్‌గా, పక్షపాత రహితంగా ఉంటుంది. ఇది కాగితం ఆధారిత రిజిస్టర్లపై ఆధారపడే సాంప్రదాయ విధానాల్లో ఉండే మానవ తప్పిదాలను తగ్గిస్తుంది. టీచర్ల హాజరు డేటాను రియల్ టైమ్‌లో అధికారులు పర్యవేక్షించవచ్చు. గైర్హాజరీని సులభంగా గుర్తించి, తగిన చర్యలు తీసుకోవచ్చు. టీచర్లు రెగ్యులర్‌గా హాజరై, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి దోహదపడుతుంది.
టీచర్లు మామూలోళ్లు కాదు..
అయితే ఇలాంటి టెక్నాలజీ ప్రయత్నాలు గతలో అనేకం జరిగాయి. కానీ, టీచర్లు మామూలోళ్లు కాదు కదా.. అన్నింటిని ఏదో ఒక సాకు చెప్పి పక్కన పడేశారు. తాజాగా ఫేషియల్ రిగన్నేషన్ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రామీణ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ, సరైన డివైస్‌ల లభ్యత సమస్యలు రావచ్చు.టీచర్ల బయోమెట్రిక్ డేటా సేకరణ, దాని భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేయవచ్చు. టీచర్ల సంఘాలు ఈ విధానాన్ని అమలు చేయడంపై అభ్యంతరాలు తెలపవచ్చు. దీనివల్ల పని ఒత్తిడి పెరుగుతుందని వాదించవచ్చు.