HomeతెలంగాణRevanth Reddy: రేవంత్‌ టార్గెట్‌ రీచ్‌ అవుతాడా.. ఇబ్బంది పడతాడా..?

Revanth Reddy: రేవంత్‌ టార్గెట్‌ రీచ్‌ అవుతాడా.. ఇబ్బంది పడతాడా..?

Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోష్‌ను లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సీఎం, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీ బలం సీపీఐతో కలిసి 68కి పెరిగింది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

టార్గెట్‌ 14..
ఇక లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు గెలవాలని రేవంత్‌రెడ్డి టార్గెట్‌ పెట్టుకున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ బలహీన పడిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు. తమ వంద రోజుల పాలనలో ప్రవేశపెట్టిన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం తదితర పథకాలు లోక్‌సభ ఎన్నిల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని రేవంత్‌ ధీమాగా ఉన్నారు. కానీ, గ్రౌండ్‌ లెవల్‌ మరోలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ టార్గెట్‌తో రేవంత్‌ ఇబ్బంది పడతారని కొంతమంది పేర్కొంటున్నారు. ఏరకంగా చూసిన కాంగ్రెస్‌ 10 నుంచి 11 స్థానాలకు మించి గెలవలేదని అంటున్నారు.

బీఆర్‌ఎస్‌ బలహీనతపైనే నమ్మకం..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్రమంగా బలహీన పడుతున్న బీఆర్‌ఎస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో తమకు బలంగా మారుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న ఓటర్లు.. ఈసారి కాంగ్రెస్‌కు ఓటేస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీకి ఓటు బ్యాంకు ఆ పార్టీకి ఉన్నా.. కాంగ్రెస్‌ + బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపునకు బాటలు వేస్తుందని అంచనా వేస్తున్నారు.

నెరవేర్చని హామీలతో ఇబ్బంది..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ జాప్యం చేస్తోంది. ప్రధానంగా రైతు రుణమాఫీ చేయలేదు. మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం అందలేదు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయలేదు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వడం లేదు. వ్యవసాయానికి సాగునీటి సమస్య, కరెంటు కష్టాలు, పెన్షన్ల పెంపు జరుగలేదు. దీంతో ఇవి ఎన్నికల్లో ప్రభావం చూసే అవకాశం ఉంది.

బీజేపీ పుంజుకునే అవకాశం..
ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మరింత పుంజుకుంటుందని తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 స్థానాల్లో గెలిచింది. 13 శాతంపైగా ఓట్లు సాధించింది. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందన్న భావన చాలా మందిలో ఉంది. యువత బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గతంలో గెలిచిన 4 స్థానాలకు, మరో 4 స్థానాలు జత కలిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. ఇది కాంగ్రెస్‌ వైఫల్యాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ టార్గెట్‌ రీచ్‌ అవడం కష్టంగా కనిపిస్తోంది. ఈ టార్గెట్‌ మిస్‌ అయితే… రేవంత్‌ సెల్ఫ్‌ గోల్‌ కొట్టుకున్నట్లే.

భారమంతా రేవంత్‌పైనే..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అన్నీ తానై అధికారంలోకి తెచ్చిన రేవంత్‌పైనే లోక్‌సభ ఎన్నికల భారం పడే అవకాశం ఉంది. మంత్రులు సైలెంట్‌గా ఉన్నారు. దీంతో రేవంత్‌ రెడ్డి ఒంటరి పోరాటం చేయక తప్పని పరిస్థితి. ఇటీవలే అధికారంలోకి వచ్చిన రాష్ట్రం కాబట్టి తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం భారీగా ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను నిలబెట్టాలంటే రేవంత్‌రెడ్డి మరింత శ్రమించక తప్పదు. ఆ శ్రమకు తగ్గ ఫలితం వస్తే కాంగ్రెస్‌లో ఆయనకు తిరుగుండదు. తేడా వస్తే మాత్రం అన్ని వేళ్లు రేవంత్‌నే చూపిస్తాయి. ప్రతిపక్షాల రేవంత్‌ పాలననే టార్గెట్‌ చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular