Revanth Reddy Kerala campaign : రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజుల్లో కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత పరిపాలన మీద పట్టు సాధించడం మొదలుపెట్టారు. మంత్రుల మీద కూడా తన మార్క్ పెత్తనం ప్రదర్శిస్తున్నారు. అధిష్టానం ఎదుట మంచి మార్కులు సాధించుకొని.. గట్టి లీడర్ గా ఎదిగారు. కర్ణాటక.. ఇంకా కొన్ని ప్రాంతాలలో అధికారంలో ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిపుష్టి ఉన్న నాయకుడు కావడంతో అధిష్టానం రేవంత్ రెడ్డికి కేరళ బాధ్యతలు అప్పగించింది.
దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కేరళ కూడా ఉంది. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని చెందిన ఇతర ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం కేరళలోనే మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు.. ఫైర్ బ్రాండ్ లీడర్లు.. గట్టి స్వరం ఉన్న నాయకులు కేరళ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వారిలో దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. కేరళ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో నిర్వహిస్తున్న రోడ్డు షోలలో పాల్గొన్నారు. అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
కేరళ రాష్ట్రంలో అధికార భాషగా మలయాళం ఉంది. దక్షిణ భారతదేశంలో మలయాళం అనేది అత్యంత క్లిష్టమైన భాష. అందువల్లే రేవంత్ ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో.. ఒక అనువాదకుడిని నియమించుకుంటున్నారు.. “మలయాళ ప్రజలకు నమస్కారం.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయండి. కేరళ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో కాంగ్రెస్ పార్టీ చూపించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ మలయాళంలో రేవంత్ రెడ్డి పలుకుతున్నారు. ఆ ప్రసంగాలకు సానుకూల స్పందన లభిస్తుంది. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్‌లో.. హిందీలో కూడా మాట్లాడగలిగే నైపుణ్యం ఉన్నవారు కాబట్టి.. ఆ రెండు భాషలలో మాట్లాడుతూ మలయాళ ఓటర్ల మనసు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. కేరళ ప్రజలకు హిందీతోపాటు ఇంగ్లీష్ కూడా వస్తుంది. అందువల్లే తెలంగాణ సీఎం మాటలకు కాస్త రీచ్ కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి తో పాటు శ్రీధర్ బాబు కూడా మలయాళ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని మట్టుతారా నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రోడ్డు షో నిర్వహించారు. అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కేరళ అభివృద్ధికి యుడిఎఫ్ కట్టుబడి ఉందని.. యు డి ఎఫ్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.. ఇక ప్రచారంలో రేవంత్ రెడ్డి పదేపదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. మతపరమైన రాజకీయాలను కేరళ ప్రజలు ఒప్పుకోరని.. మతాలపరంగా విడిపోవడానికి సిద్ధంగా ఉండరని రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి విజయన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెరచాటుగా ఒప్పందాలు చేసుకున్నారని.. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రేవంత్..
కాగా, ఈ స్థాయిలో ప్రచారం చేస్తున్నప్పటికీ సర్వేలలో మాత్రం కేరళ రాష్ట్రంలో విజయన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలుస్తోంది. ఎల్డిఎఫ్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటికీ గతంలో మాదిరిగా మెజారిటీ రాదని.. ఈసారి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత ముఖ్యమంత్రి కి తిరుగులేదని.. నగర ప్రాంతాలలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందని సర్వేలు చెబుతున్నాయి.. సర్వేలలో వచ్చిన నివేదికలను ఒకసారి పరిశీలిస్తే కేవలం 30 శాతం మంది మాత్రమే విజయన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని.. ఇతర వ్యక్తులు ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుందని చెబుతున్నారని తెలుస్తోంది. అయితే మిగతా పార్టీలలో అగ్ర నాయకులు అంత గొప్పగా లేకపోవడం విజయన్ కు కలసి వస్తోంది.
