Raja Saab Ticket Prices: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నటించిన రాజా సాబ్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో ఈ సినిమాను భారీగా విడుదల చేశారు. వింటేజ్ ప్రభాస్ ను ఈ సినిమాలో చూపిస్తున్నామని మారుతి పదే పదే చెప్పడంతో.. రాజా సాబ్ పై ఆసక్తి అమాంతం పెరిగిపోయింది.
భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మించింది. భారీ బడ్జెట్ తో రూపొందించిన నేపథ్యంలో.. సినిమా టికెట్ ధరలను పెంచడం అనివార్యం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచారు. తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఏర్పడింది. టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్థిరమైన వైఖరితో ఉండడంతో చివరి వరకు కూడా ఉత్కంఠ నెలకొంది. ఇదే క్రమంలో టికెట్ ధరలను తెలంగాణ ప్రభుత్వం పెంచే అవకాశం లేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాజా సాబ్ తో పాటు మన శివశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు హైకోర్టుకు వెళ్లారు. తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన రాష్ట్ర హైకోర్టు.. టికెట్ ధరల పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం హోంశాఖ కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చివరి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గురువారం అర్ధరాత్రి తెలంగాణ ప్రభుత్వం రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 9వ తేదీ నుంచి ఈనెల 11 వరకు సింగిల్ స్క్రీన్ లో ₹105, మల్టీప్లెక్స్ లలో ₹132, 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ లో ₹52, మల్టీప్లెక్స్ లో ₹89 వరకు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, లాభాలలో 20% ఫిలిం ఫెడరేషన్ కు ఇవ్వాలని సూచించింది. గత ఏడాది పుష్ప సినిమా వివాదం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం టికెట్ ధరల పెంప విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. టికెట్ ధరలను పెంచేది లేదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికులతో సమావేశం అయ్యారు. ఫిలిం ఫెడరేషన్ కు 20% వాటా ఇస్తేనే టికెట్ ధరలను పెంచుతామని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం రాజా సాబ్ సినిమా నిర్మాతలకు ఫెడరేషన్ కు 20% వాటా ఇవ్వాలనే షరతు విధించింది.