HomeతెలంగాణRevanth Reddy Viral Video: చాపమీద కూర్చొని.. తింటూ.. ఫిదా చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Viral Video: చాపమీద కూర్చొని.. తింటూ.. ఫిదా చేసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy Viral Video: రాజకీయ నాయకులకు నేల విడిచి సాము చేయడం అనేది అలవాటే. కానీ కొన్ని సందర్భాలలో వారు కూడా నేల మీదికి వస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఎలాగూ నేల మీద ఉంటారు కాబట్టి వారి గురించి పెద్దగా చర్చ అవసరం లేదు. కానీ అధికారంలో ఉన్నవారు కూడా నేల మీదకి వచ్చారంటే కాస్త చర్చించుకోవాల్సిందే.

ముఖ్యమంత్రిగా రేవంత్ తన తొలి అడుగు బలంగానే వేశారు. అదేంటి ఆయన ముఖ్యమంత్రి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంటే తొలి అడుగు అంటారేంటి.. అనే ప్రశ్న మీలో ఉదయించవచ్చు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది తన ఐకానిక్ సింబల్ అని చెప్పుకునే ఒక పథకాన్ని కూడా ఆయన ప్రారంభించలేకపోయారు. ఇప్పుడు ఆ అవకాశం ఆయనకు లభించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైన హామీలలో ఇందిరమ్మ స్కీం ఒకటి. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఐదు లక్షల సహాయం చేస్తుంది ఇప్పటికే మొదటి విడతగా లబ్ధిదారులకు ప్రభుత్వం లక్ష రూపాయలు మంజూరు చేసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండలపాడు లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరిగింది. లబ్ధిదారులతో ముచ్చటిస్తూ.. వారు నిర్మించుకున్న గృహాలలోకి వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్. వారితో పాటు గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి నేల మీద కూర్చొని భోజనం చేశారు. తమ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో వండిన వంటను ఆయన సంతృప్తిగా తిన్నారు.

ఒక నాయకుడికి రాజకీయాలు పెద్దగా సంతృప్తి ఇవ్వవు. రాజకీయాలు కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అధికారం దక్కించుకోవాలనే కాంక్ష పెరిగితే రాజకీయాల రూపు కూడా మారిపోతుంది. బహుశా అలాంటి రాజకీయాలు చూసి చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది పడి ఉంటారనుకుంటా.. అందువల్లే కాస్త వాటి నుంచి సాంత్వన పొందడానికి ఇదిగో ఇలా లబ్ధిదారుల వద్దకు వచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ.. తాను ఏర్పాటు చేసిన పథకం పేదలకు లబ్ధి చేకూర్చింది అనే ఆనందంలో.. ఆయన పరవశించిపోయారు. అందుకే లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు.

ఇటీవల కూడా శ్రీరామనవమి వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. ఆ తర్వాత సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబం వద్దకు వెళ్లారు. సన్నబియ్యంతో వండిన వంటలు తిన్నారు. ఆ కుటుంబ సభ్యులకు దుస్తులు కూడా పెట్టారు. ఒక నాయకుడికి ఇంతకంటే గొప్ప సందర్భాలు ఏముంటాయి. బహుశా ఇలాంటి జ్ఞాపకాలను మరిన్ని పెంచుకోవాలని రేవంత్ భావిస్తున్నట్టున్నారు. మిగతా కాంగ్రెస్ నాయకులు అతని ఆనందాన్ని తట్టుకుంటారా.. అతని కళ్ళల్లో నిప్పులు పోయరా.. అనే ప్రశ్నలు వ్యక్తం కావచ్చు. కానీ అంత ఈజీగా సీటును వదులుకోవడానికి రేవంత్ సిద్ధంగా లేరు. ఎందుకంటే దానిని సాధించడానికి ఆయన ఏ స్థాయిలో కష్టపడ్డారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular