HomeతెలంగాణRevanth Reddy government: మందుబాబులకు షాక్‌ ఇవ్వబోతున్న రేవంత్‌ సర్కార్‌..

Revanth Reddy government: మందుబాబులకు షాక్‌ ఇవ్వబోతున్న రేవంత్‌ సర్కార్‌..

Revanth Reddy government: తెలంగాణ దేశంలోనే మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. ప్రత్యేక రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఏటా అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. కాంగ్రెస్‌ కూడా కేసీఆర్‌ ప్రభుత్వం తరహాలోనే ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. గతేడాది మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా మారోమారు మందుబాబులకు షాక్‌ ఇవ్వాలని భావిస్తోంది. మే నెలలో ధరల పెంపు ప్రకటించే అవకాశం ఉందని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, గాజు సీసాల కొరత వంటి కారణాలతో డిస్టిలరీ యాజమాన్యాలు ధరల పెంపు కోరగా, ప్రభుత్వం దీనిపై కసరత్తు ప్రారంభించింది.

ధరల పెంపుకు కారణాలు…
మద్యం ధరలు పెంచడానికి ప్రభుత్వం కొన్ని కారణాలు చెబుతోంది. గాజు సీసాల ఉత్పత్తి దేశవ్యాప్తంగా 40 శాతం పడిపోయిందని, దీంతో ఖాళీ సీసాల ధరలు 20 శాతం పెరిగాయంటోంది. అల్యూమినియం క్యాన్ల ధరలు కూడా పెరగడంతో తయారీదారులు నష్టాల్లోకి వెళ్లారు. వేసవి కావడంతో బీర్లకు డిమాండ్‌ 30% పెరిగింది. కానీ సీసాల కొరత, ధరల పెరుగుదల వల్ల సరఫరా 20% తగ్గింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో మద్యం కొరత ఏర్పడిందంటోంది. రాష్ట్రంలో మద్యం ధరల సవరణ జరిగి ఏడాది దాటిపోయింది. సాధారణంగా ఏటా జరిగే ఈ సమీక్ష ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఉత్పత్తి ఖర్చులు భరించలేమని, 12–15 శాతం ధరలు పెంచాలని డిస్టిలరీ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి.

జ్యుడీషియల్‌ కమిటీ పరిశీలన..
ధరల పెంపు ప్రతిపాదనలను పరిశీలించడానికి ప్రభుత్వం ఒక రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ బాటిల్‌ పరిమాణం, బ్రాండ్ల వారీగా రేట్లు, పన్నుల విశ్లేషణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం కోరింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా మే నెలలో ప్రభుత్వం కొత్త ధరలను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఎంత పెరగొచ్చు?
డిస్టిలరీ యాజమాన్యాలు 12–15 శాతం ధరలు పెంచాలని ప్రతిపాదించాయి. ప్రైస్‌ ఫిక్సేషన్‌ కమిటీ 15 నుంచి నుంచి 20 శాతం వరకు ధరలు పెంచవచ్చని నివేదిక రూపొందించినట్లు సమాచారం. చీప్‌ లిక్కర్‌ ధరలు అలాగే ఉంచి, మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతి మద్యం (ఐఎఫ్‌ఎమ్‌ఎల్‌) రకాలపై ధరలు పెంచే అవకాశం ఉంది. బీర్ల ధరలు 15 శాతం పెరిగితే, వ్యాట్, ఎక్సైజ్‌ సుంకంతో కలిపి ఒక్క సీసా రూ.180 దాకా పెరగవచ్చు.

మందుబాబులపై భారం
ధరలు పెరిగితే సామాన్య మద్యం ప్రియులపై గణనీయమైన భారం పడనుంది. ప్రస్తుతం రూ.150 ఉన్న చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ ధర 15 శాతం పెరిగితే రూ.172 నుంచి రూ.175కి చేరుకుంటుంది. విస్కీ, బ్రాందీ, రమ్‌ వంటి ప్రీమియం బ్రాండ్లపై రూ.20 నుంచి రూ.30 వరకు పెరగవచ్చు. ధరల పెంపు భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరో మార్గం కూడా ఆలోచిస్తోంది. కర్ణాటక తరహాలో మద్యాన్ని టెట్రా ప్యాకెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.దీని ద్వారా ప్రతి క్వార్టర్‌ మీద కనీసం రూ.15 నుంచి రూ.20 వరకు తగ్గే అవకాశం ఉంది. గాజు సీసాల అవసరం తగ్గడంతో పాటు, రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి.

జ్యుడీషియల్‌ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత, మే నెల మొదటి వారంలో ప్రభుత్వం ధరల పెంపుపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మద్యం ప్రియులు ఇకపై మరింత డబ్బులతో మద్యం దుకాణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం టెట్రా ప్యాకెట్ల వంటి ప్రత్యామ్నాయం అమలు చేస్తే భారం తగ్గుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version