Homeక్రైమ్‌Power of Telangana Police: పోలీసులు తలుచుకుంటే.. ఎంతటి నేరగాడైనా తప్పించుకోలేడు..ఇదిగో రుజువు..

Power of Telangana Police: పోలీసులు తలుచుకుంటే.. ఎంతటి నేరగాడైనా తప్పించుకోలేడు..ఇదిగో రుజువు..

Power of Telangana Police: రాజకీయ నాయకులు మధ్యలో వేలు పెట్టకుంటే.. ఇతర వ్యవస్థలు అడ్డుతగలకుంటే పోలీసులు అద్భుతంగా పనిచేస్తారు. నేరగాళ్ల పని పడతారు. శాంతి భద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేస్తారు.. అలాంటిదే ఈ సంఘటన కూడా. అయితే ఈ కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలు.. ఇతర సాక్ష్యాలు కీలకంగా నిలిచాయి. అవే నిందితుడికి జైలు శిక్ష పడేలా చేశాయి. ఏకంగా జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారంటే పోలీసులు ఎంత పకడ్బందీగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

అది 2021 సంవత్సరం.. నల్గొండ జిల్లా.. ఆ జిల్లాలోని తిప్పర్తి గ్రామానికి చెందిన ఖయ్యుమ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ వ్యక్తి వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఖయ్యుమ్ ది మొదటినుంచి జల్సా స్వభావం. పైగా ఆడపిల్లల విషయంలో అతడు అత్యంత దారుణంగా ప్రవర్తించేవాడు. అడ్డగోలుగా మాట్లాడేవాడు. అటువంటి ఖయ్యుమ్ ఓ బాలికను చూశాడు. చూసిన వెంటనే ఆమెతో తప్పుడు విధంగా ప్రవర్తించాడు. ఆమె కనిపించిన ప్రతి సందర్భంలోనూ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. దానికి ఆమె ఒప్పుకునేది కాదు. ఒకరోజు ఆ బాలిక ఇంటికి వెళ్తుండగా బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించుకున్నాడు. అపహరించి లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. అయితే అతని బారి నుంచి ఎలాగోలా బయటపడిన ఆ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. తనకు ఎదురైన దారుణాన్ని వివరించింది. తల్లిదండ్రులతో కలిసి తిప్పర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. పోలీసులు వివిధ చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.

వాదనలు విన్న తర్వాత..

ఈ కేసులో ఆధారాలు సేకరించడంలో పోలీసులు విజయవంతమయ్యారు. సిసి ఫుటేజ్… కారు లో ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ బాలికపై ఎక్కడ అఘాయిత్యానికి పాల్పడింది? నిందితుడి గత చరిత్ర.. ఇవన్నీ కూడా పోలీసులు తెలుసుకొని పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించారు. వీటన్నిటిని కోర్టుకు సమర్పించారు. పోలీసులు సమర్పించిన ఆధారాలతో ఏకీభవించిన న్యాయమూర్తి కీలక తీర్పు వెలువరించారు. ఆ బాలికపై దారుణానికి పాల్పడిన ఖయ్యుమ్ కు పోక్సో చట్టం కింద సెక్షన్ -1 ప్రకారం 20 సంవత్సరాల జైలు శిక్ష, 25వేల జరిమానా విధించారు. ఆమె నిమ్న వర్గానికి చెందిన బాలిక కావడం.. అది తెలిసి కూడా ఆ వ్యక్తి దారుణానికి పాల్పడిన నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 20 సంవత్సరాల జైలు శిక్ష, 25 వేల జరిమానా.. బాలికను అపహరించిన నేరానికి 10 సంవత్సరాల జైలు, 5000 జరిమానా.. కక్షపూరితంగా వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో ఏడాది జైలు, పదివేల జరిమానా.. మొత్తంగా 50+ సంవత్సరాల జైలు శిక్ష.. 80000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అంతేకాదు ఆ బాలికకు ఏడు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని జిల్లా న్యాయ సేవా సహకార సంస్థను న్యాయమూర్తి ఆదేశించారు.

ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు

వాస్తవానికి ఇటువంటి కేసుల్లో సరైన ఆధారాలు సమర్పించడంలో పోలీసులు విఫలమవుతుంటారు. మధ్యలో రాజకీయ జోక్యం తోడు కావడంతో పోలీసులు చేతులెత్తేస్తూ ఉంటారు. కానీ ఈ కేసులో మాత్రం పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా కోర్టుకు సమర్పించారు. దీంతో న్యాయమూర్తి బాధితురాలికి అండగా నిలబడ్డారు. దారుణానికి పాల్పడిన దుర్మార్గుడికి 51 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కనివిని ఎరుగని స్థాయిలో తీర్పు చెప్పారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version