Namasthe Telangana- KCR: రెండు సంవత్సరాలుగా జీతాల్లో పెంపుదల లేదు. తిగుళ్ళ కృష్ణమూర్తి ఎడిటర్ గా వచ్చిన తర్వాత సీనియర్లు అందరూ ఇంటి ముఖం పడుతున్నారు. వస్తూ వస్తూనే కృష్ణమూర్తి మొత్తం తన వాళ్లను తెచ్చుకున్నాడు. గతంలో ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నప్పుడు కూడా ఇలానే చేశాడు. ఫలితంగా అందులో పని చేస్తున్న చాలామంది ముస్లిం జర్నలిస్టులు బాహాటంగానే యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. స్కై బాబా లాంటి జర్నలిస్టులు అర్ధాంతరంగా రాజీనామా చేశారు. ఇక అక్కడి నుంచి నమస్తే తెలంగాణకు వచ్చిన తిగుళ్ల కృష్ణమూర్తి ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన వర్గం వారికి అద్భుతమైన జీతాలు ఇప్పించుకున్నారు. కానీ అంతకు ముందున్న వారిపై ఒత్తిడి పెంచడంతో.. కొందరు తట్టుకోలేక బయటకు వెళ్లిపోయారు.

ప్రస్తుతం నమస్తే తెలంగాణలో తిగుళ్ల కృష్ణమూర్తి ఏది చెప్తే అదే వేదం. ఏది రాస్తే అదే కథనం. ఎవరు కూడా మారు మాట మాట్లాడేందుకు అవకాశం లేదు. ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య ‘దేశ్ కి నేత’ అనే ప్రచారాన్ని నమస్తే తెలంగాణ డీజే చప్పుళ్ళతో మారు మోగిస్తోంది. దేశం కెసిఆర్ ను కోరుకుంటున్నదని, భావి భారత ప్రధాని అయ్యే అవకాశం కేసీఆర్ కు తప్ప ఇంకా ఎవరికీ లేదని ఢంకా బజాయించి మరి చెబుతోంది. ఈమధ్య ఈ భజన కాస్తా మోతాదు మించిపోయింది. దసరా రోజున కనీసం జర్నలిస్టులకు సెలవు కూడా ఇవ్వాలనే సోయి లేని యాజమాన్యం.. పండుగ రోజు కూడా ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. ఇందుకు కారణం కేసీఆర్ ఆరోజు బీఆర్ఎస్ ప్రకటన చేయడమే.. ఆ మరుసటి రోజు వెలువరించిన ఎడిషన్ కెసిఆర్ భుజకీర్తులతోనే నమస్తే తెలంగాణకు సరిపోయింది.. అయితే కెసిఆర్ స్తోత్రం పఠించడం లో పప్పులో కాలేసింది. ముందు వెనకా చూసుకోకుండా రాసిన ఓ వార్తకు లెంపలేసుకుంది. ఇప్పుడు క్షమించమని వేడుకుంటున్నది.
-ఒకటి చెప్తే మరొకటి రాసింది
పార్టీల చేతుల్లో ఉన్న పత్రికలు అంతే. ఒకటి చెప్తే మరొకటి రాసుకుంటాయి. వాళ్ల ఫోటోను దర్జాగా అచ్చేసుకుంటాయి. మొన్న మేడిగడ్డ బాధితులు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని రాసిన నమస్తే తెలంగాణ.. అక్కడి సర్పంచుకు తెలియకుండానే అతని ఫోటో వాడింది. కెసిఆర్ పాలన గొప్పగా ఉందని అతడు చెప్పినట్టు రాసుకుంటూ వచ్చింది. మరుసటి రోజు పత్రికలో చూసిన సదరు సర్పంచ్, ఆ మేడిగడ్డ ముంపు బాధితులు నమస్తే తెలంగాణ పత్రికలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీని నుంచి పాఠం నేర్చుకోని ఆ పత్రిక ఈసారి ఏకంగా ఓ జాతీయ జర్నలిస్టు ట్వీట్లకు వక్ర భాష్యం చెప్పి, కేసీఆర్ కి అనుకూలంగా రాసుకు వచ్చింది. సాధారణంగా ఇలాంటి వార్తలు నమస్తే తెలంగాణ, సాక్షిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ వార్తల తాలూకు ఫోటోల్లో ఉన్నవారు మీడియా ముందుకి వచ్చి తాము అలా అనలేదని చెప్పినా కనీసం సవరణలు కూడా వేసే పరిస్థితి ఉండదు. సాక్షి తరహాలోనే స్టాండర్డ్స్ ఉండే.. నమస్తే తెలంగాణ జాతీయ జర్నలిస్టుకి క్షమాపణలు చెప్పింది.
-తప్పు అయ్యింది… మన్నించండి.. అంటూ వేడుకోలు..
తెలంగాణ రాష్ట్ర సమితి స్థానంలో ‘భారత్ రాష్ట్ర సమితి’ అనే పేరుతో కెసిఆర్ జాతీయ పార్టీ పేరు ప్రకటించిన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారాన్ని హోరెత్తించింది. ఇదే క్రమంలో జాతీయస్థాయిలో కొంతమంది అభిప్రాయాలు కూడా తీసుకున్నది. ఇలా వచ్చిన అభిప్రాయాల్లో ‘లిజ్ మాతృ’ అనే జర్నలిస్టుది కూడా ఉంది. ఆమె ఢిల్లీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. తన ఫోటోతో సహా వచ్చిన ఆర్టికల్ చూసి ఆమె అవాక్కయ్యారు. వెంటనే అగ్గిమీద గుగ్గిలం అయిపోయి ట్వీట్ చేశారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చుననే అర్థం వచ్చేలా తాను ట్వీట్ చేశానని, కాని దానిని అన్న నమస్తే తెలంగాణ పేపర్ యాజమాన్యం కేసిఆర్ కు అనుకూలంగా రాయడం సరికాదని ఆమె స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ సొంత పత్రికకు షాక్ తగిలినట్లుంది.

ఈ ప్రభావం వల్ల ఎవరైనా నమస్తే తో మాట్లాడాలంటే భయపడేలా చేసింది. వెంటనే లెంపలు వేసుకుని క్షమాపణ చెబుతున్నట్టుగా ‘నమస్తే తెలంగాణ పత్రిక’ సవరణ వేసింది. వాస్తవానికి పత్రికలు అనేవి భిన్న పార్శ్వ వ్యక్తుల అభిప్రాయాలకు నిలువుటద్దాలుగా ఉండాలి. కానీ పార్టీల కోసం పనిచేసే పత్రికల్లో ప్రమాణాలు ఆశించడం మన దురాశ అవుతుంది. కనీసం ప్రతిపక్షాలకు ఏమాత్రం స్పేస్ ఇవ్వని నమస్తే తెలంగాణ.. దేశం కోసం కేసీఆర్ పోరాడుతున్నాడు అని రాస్తుండటం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టే’ ఉంది అని కొంతమంది జర్నలిస్టులు వాపోతున్నారు . భారత్ రాష్ట్ర సమితి ప్రారంభంలోనే ఇంతలా రెచ్చిపోతున్న నమస్తే తెలంగాణ.. మునుముందు ఎలాంటి వక్రీకరణలకు దిగుతుందో వేచి చూడాల్సి ఉంది.